Arrangements | పెద్దపల్లి, అక్టోబర్8: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాటు చేయాలని రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని జిల్లా అధికారులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జల్ద అరుణ శ్రీ, డీసీపీ కరుణాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 9న ఉదయం 10. 30 గంటల వరకు విడుదల చేయాలని సూచించారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ పరిధిలోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలని స్పష్టం చేశారు. అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 11 వరకు ఉదయం 10, 30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలన్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ మొదటి విడతలో పెద్దపల్లి జిల్లాలో 68 ఎంపీటీసీ, 7 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. రిటర్నింగ్ అధికారులకు, ఇతర సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి పంపిణీ పూర్తైందని, నామినేషన్ కేంద్రాల వద్ద అవసరమైన భద్రత కల్పించామన్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పట్టిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీసీలో కలెక్టర్, అదనపు కలెక్టర్, డీసీపీతో పాటు జడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీర బుచ్చయ్య, పెద్దపల్లి, మంథని ఆర్డీవోలు గంగయ్య, సురేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.