Strike | పెద్దపల్లి, సెప్టెంబర్15: టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ మరమ్మతు పనులు చేసే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ 16 నుంచి సమ్మె బాట పట్టనున్నారు. ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్) పెంచాలని డిమాండ్ చేస్తూ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టే సమ్మెతో ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 విద్యుత్ సర్కిల్లో విద్యుత్ మరమ్మతుల పనులు బంద్ కానున్నాయి. దీంతో సరఫరాలో సమస్యలు తలెత్తె అవకాశమూ లేకపోలేదు. ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచాలని ఎన్పీడీసీఎల్ సీఎండీకి వినతి పత్రాలు అందించి చర్చించినా ఫలితం లేకపోవటంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మెలోకి పోతున్నామని ఎలక్టికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అలుగుబెల్లి కృష్ణారెడ్డి తెలిపారు.
2021 నుంచి ఎస్ఎస్ఆర్ రివైజ్ చేయకపోయిన లేబర్ రేట్లు రెండింతలు పెరిగాయని వాపోయ్యారు. ఆర్ధికంగా నష్టపోతున్నామని ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచే దాకా సమ్మెలో పాల్గొంటామని ఆయన స్ఫష్టం చేశారు. ఈ మేరకు సోమవారం పెద్దపల్లి సర్కిల్ కార్యాలయంలో ఏడీఈ టెక్నికల్ అన్నపూర్ణ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం సధాకర్, ఉపాధ్యాక్షుడు సమ్మయ్య, కాంట్రాక్టర్లు పిల్లి రాజు, కోటి, మోహన్, రాధయ్య తదితరులు పాల్గొన్నారు.