Fake seeds | వేములవాడ, జూన్ 5: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వేములవాడ పట్టణంలోని ఎరువులు విత్తనాల దుకాణాలను ఆయన గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లాలో ఎరువులు ,విత్తనాలు నిబంధనలు ప్రకారం విక్రయించాలని సంబంధిత అధికారులను, విక్రయదారులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గురువారం వేములవాడ పట్టణంలోని హనుమాన్ ఎంటర్ప్రైజెస్ విత్తనాలు, శ్రీ లక్ష్మీ ట్రేడర్స్ ఎరువులు అండ్ విత్తనాలు విక్రయ దుకాణాలను, గోదాములను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా దుకాణాల్లో విత్తనాలను పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీ లక్ష్మీ ట్రేడర్స్ ఎరువులు దుకాణం లోని సేల్స్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ పరిశీలించి గోదాం ను తనిఖీ చేయగా రిజిస్టర్ల ప్రకారం గోదాములో ఎరువులు లేనట్లు గమనించి సదరు దుకాణంలో అమ్మకాల నిలిపివేతకు నోటీసులు జారీ చేయవలసిందిగా అధికారులకు సూచించారు. సదరు నోటీసులకు సరైన సంజాయిషీ ఇవ్వని యెడల దుకాణాన్ని సీజ్ చేయవలసిందిగా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అందజేయాలని , కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని విక్రయ యజమానులను కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీలలో ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఏడిఏ రామారావు, మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్ తదితరులు ఉన్నారు.