Collector Koya Sri Harsha | పెద్దపల్లి, మే31: జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చారించారు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని శనివారం వెల్లడించారు. జూన్ 7న బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, ఎద్దులు, కోడె దూడలను అక్రమంగా తరలించకుండా జిల్లాలో 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
బసంత్ నగర్, దుబ్బపల్లి, గుంపులో చెక్ పోస్టులు ఉంటాయని తెలిపారు. పోలీసు, పశుసంవర్ధక శాఖ అధికారులు సంయుక్తంగా ఈ చెక్ పోస్టులలో 24 గంటలు విధులు నిర్వహిస్తారని తెలిపారు. అవసరమైతే మరో చెక్ పోస్టు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. పశువులను తరలించే వాహనం, వాహన డ్రైవర్, అమ్మిన, కొన్న వారి వివరాలు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే వివరాలను అధికారులు పరిశీలిస్తారని పేర్కొన్నారు.
పశువుల మార్కెట్ (సంత)లో పశువులను కొనడం, అమ్మడం వెంటనే నిలిపివేయాలని సూచించారు. ఎవరైన అక్రమంగా ఆవులు, ఎద్దులను రవాణా చేస్తే వెంటనే సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.