పెద్దపల్లి, మే23 : జిల్లాలోనిడీలర్లు నిబంధనలు పాటిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలుంటాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. విత్తనాల విక్రయం లో ఈ పాస్ యంత్రాల వినియోగంపై రిటైలర్లకు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో శుక్ర వారం నిర్వంచిన శిక్షణ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేటి అవినాష్ రెడ్డితో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ వానకాలం సాగుకు అవసరం అయ్యే విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
పంటకు అవసరమైన ఎరువులు, డీఏపీ స్టాక్ వివరాలను ఈ పాస్ యంత్రా ల్లో అప్ డేట్ చేయాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే సంబంధిత డీలర్ల నుంచి రైతులకు నష్టపరిహారం అంచనా వేసి చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేటి అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు నేరుగా రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ నుంచి నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో కనీసం పదివేల క్వింటాళ్లు ప్రభుత్వ రంగ విత్తనాలు అమ్మాలని డీలర్లకు సూచించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి, డీఏవో దోమ ఆదిరెడ్డి, వ్యవసాయ, పోలీస్, అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.
సుల్తానాబాద్, మే 23 : రైస్ మిల్లర్లు సకాలంలో ధాన్యం దించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి పూసాలలోని మిథిలా రైస్‌మిల్‌ను తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద నాణ్య తా ప్రమాణాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే కోనుగోలు చేసి రైస్‌మిల్లులకు పంపిస్తున్నామని, మిల్లుల వద్ద వాహనాలు వేచి ఉండకుండా వెంటనే దించుకోవాలన్నారు. ప్రభుత్వం అందించిన ధాన్యానికి సంబందించి సీఎంఆర్‌ను నిర్దేశిత గడువులోగా సరఫరా చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట పౌరసరఫరాల మేనేజర్ శ్రీకాంత్, డీటీ సీఎస్‌లు మహేష్, రవీందర్, సంబందిత అధికారులున్నారు.
ఫర్టిలైజర్‌సిటీ, మే 23: గర్భిణులకు ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. రామగుండం వైద్య కళాశాలను శుక్రవారం సందర్శించారు. గర్భిణులకు అందించే వైద్యసేవలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గోదావరిఖని ప్రభు త్వ దవాఖానలో ఎక్కువగా ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీఫా స్కానింగ్ యంత్రం కూడ అందుబాటులో ఉందని, ఆశ వర్కర్ల ద్వారా దవాఖానలో ఉన్న వసతులను వివరిస్తూ అధికంగా ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. అనంతరం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలన్నారు. ఇక్కడ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు సింగ్, డీఎంచ్వో అన్నప్రసన్న కుమారి, హెచ్ఓడీలు డాక్టర్ అరుణ, డాక్టర్ శ్రీదేవి, ఆర్ఎంఓ డాక్టర్ రాజు ఉన్నారు.
కోల్‌సిటీ, మే 33: రామగుండం నగరపాలక సంస్థ నాలుగో డివిజన్ కృష్ణనగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 2కోట్లు మంజూరు చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అభ్యర్థన మేరకు కలెక్టర్ నిధులు మంజూరు చేశారు.