Strict action | జగిత్యాల, జూన్ 14 : వయో వృద్ధుల సంరక్షణ చట్టంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 40 ద్వారా జారీ చేసిన పలు ప్రయోజనకర సవరణల ద్వారా వృద్ధ తల్లిదండ్రులను నిరాధరిస్తున్న కొడుకులకు తగు చట్టపర చర్యలకు దోహద పడుతోంది. జగిత్యాల జిల్లాలో కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి డివిజన్లలో వయో వృద్ధుల సంరక్షణ చట్టం కిందవృద్ధ తల్లిదండ్రులను విస్మరిస్తున్న వారిపై ట్రిబ్యునల్ చైర్మన్లు జగిత్యాల డివిజన్ ఆర్డీవో పీ మధుసూదన్, కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీవో ఎన్ శ్రీనివాసరావులు చట్టపర చర్యలు సత్వరం తీసుకుంటూ రాష్ర్టంలోనే నెంబర్ వన్‌గా నిలిపారు.
సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, వారి సంఘ ప్రతినిధులు చెబుతున్నారు. వయౌవృద్ధులను నిరాధరిస్తున్న కేసుల్లో వారు ఇచ్చిన తీర్పులు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జగిత్యాల డివిజన్ పరిదిలోని వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామానికి చెందిన అత్తె మల్లయ్య, రాజవ్వలనే వృద్ధ తల్లిదండ్రుల ఫిర్యాదుపై కుమారుడు వెంకటయ్య తల్లిదండ్రుల నుంచి గిఫ్ట్ డీడ్ చేసుకున్న భూమి ఒక ఎకరం తండ్రీ పేరిట తిరిగి పట్టా చేయించాలని, వారికి పోషణ, ఖర్చులు ప్రతీ నెల రూ.6 వేలు ఇవ్వాలని, వైద్య ఖర్చులు భరించాలని ఆర్డీవో తీర్పు నిచ్చారు.
అలాగే రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన దడిగొప్పుల రాములు, నర్సవ్వ, అనే తల్లిదండ్రులను నిరాదరిస్తున్న కొడుకు తిరుపతి ప్రతి నెల రూ 6 వేలు వారి జీవితాంతం వరకు రూ.6 వేలు చెల్లిస్తూ, పోషణ సంరక్షణ బాధ్యతలు చూసుకోవాలని ఆర్డీవో తీర్పు నిచ్చారు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన ఓరుగంటి మల్లవ్వ కు ఇద్దరు కుమారులు, చనిపోయిన కొడుకు భార్య అయిన కోడలు కలిసి సమానంగా ప్రతి నెల రూ .10 వేలు చెల్లించాలని, వైద్య ఖర్చులు జీవితాంతం ఇవ్వాలని వయో వృద్ధుల సంరక్షణ చట్టం 2007 చాప్టర్-2 సెక్షన్ 9(1)2, జీఓ40 సవరణల ప్రకారము ఆర్డీవో తీర్పులను ఇచ్చారు.
తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.. : పీ మధుసూదన్, జగిత్యాల ఆర్డీవో
వయో వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి పిల్లలదే. విస్మరిస్తే 6 నెలల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే వీలుంది. జిల్లా సీనియర్ సిటిజెన్ల సంఘం అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో వారి సంఘ ప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ అవగాహన సదస్సులు నీర్వహిస్తున్నారు. వృద్ధులు నిరాదరణకు గురైతే వెంటనే సంబంధించిన డివిజన్ ఆర్డీవోల ట్రిబ్యునల్ లో కేసులు దాఖలు చేయిస్తున్నారు. కౌన్సెలింగ్ లు సైతం నిర్వహిస్తూ కొన్ని కేసులు ట్రిబ్యునల్‌కు రాక ముందే పరిష్కరించడం పట్ల అభినందనలు.
వృద్ధుల సంరక్షణే మా కర్తవ్యం : హరి ఆశోక్ కుమార్, జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ట్రిబ్యునల్ చైర్మన్లు జగిత్యాల ఆర్డీవో పీ మధుసూదన్, మెట్ పల్లి, కోరుట్ల ఆర్డీవో శ్రీనివాస్‌లు మా సంఘం ప్రతినిధులు తీసుకెళ్లిన కేసులను సత్వరం పరిష్కరిస్తూ రాష్ర్టములోనే నెంబర్‌వన్‌గా నిలిచారు. కనికరం లేని కొడుకులు, కొడళ్లు అర్ధరాత్రి వృద్ధులను గెంటివేస్తే మేము ఆదరించి తిరిగి వారి ఇంటికి మా ప్రతినిధులము వెళ్లి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి ఆ వృద్ధులను ఇంటిలో చేర్చుకునేలా సాయం చేస్తున్నాం. వయో వృద్ధుల వేధింపులపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు తగు తక్షణ చర్యలు తీసుకునేలా జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాం.