జగిత్యాల కలెక్టరేట్, జూలై 11 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఎస్సీ వయోవృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులపై కేసులు నమోదు చేసి విచారణను త్వరితగతిన పూర్తి చేసి దోషులకు చట్టప్రకారం శిక్షపడేలా చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 261 కేసులకు గాను రూ.2.27కోట్ల పరిహారాన్ని బాధితులకు చెల్లించాల్సి ఉండగా, 47 మందికి రూ.54.37 లక్షలు చెల్లించామని తెలిపారు. మిగతా 215 కేసులకు సంబంధించిన రూ.1.73 కోట్లు త్వరలో చెల్లింపునకు కృషి చేస్తామన్నారు. సివిల్ రైట్స్ డేలను నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. హత్యకు సంబంధించిన కేసుల్లో బాధిత కుటుంబాలు కోరిన విధంగా సహకారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. యువత చెడు అలవాట్ల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో యువజన సంఘాలు, స్వచ్ఛంద సంఘాలతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యాలయాల్లో డ్రాప్ అవుట్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. తప్పుడు కేసులు లేకుండా విచారణను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. కేసుల ప్రాధాన్యతకు అనుగుణంగా పరిహారం చెల్లించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ మాట్లాడుతూ.. కేసులను ఎప్పటికప్పుడు విచారణ చేస్తున్నామని, కళాకారుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని, విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, హత్యకు గురైన వారి కుటుంబాల వారికి ఉపాధి, ఇల్లు, వ్యవసాయ భూములు మంజూరు చేసి బాధితులను ఆదుకోవాలని పలువురు సభ్యులు కోరారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌గౌడ్, ఆర్డీవోలు మాధురి, వినోద్‌కుమార్, డీఎస్పీలు రవీందర్‌రెడ్డి, రాజశేఖర్‌రాజు, ఎస్సీ డెవలప్మెంట్ అధికారి రాజ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన మంత్రి
పెగడపల్లి, జూలై 11 : మండలంలోని వెంగళాయిపేట గ్రామానికి చెందిన పాదం రాజేందర్‌కు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును మంగళవారం ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు. కరీంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో బాధితుడికి రూ.52,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ఎంపీపీ నక్క శంకరయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాగి శ్రీనివాస్‌రావు, ఉప సర్పంచ్ రచ్చ మధుకర్ ఉన్నారు.