రాజన్న సిరిసిల్ల జూన్ 4 (నమస్తే తెలంగాణ) కోల్సిటీ/ జూన్ 4 : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో పలుచోట్ల భారీ వర్షం పడింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దాదాపు గంటపాటు పిడుగుల శబ్ధాలతో భయానక వాతావరణం కనిపించింది. గోదావరిఖనిలోని స్థానిక పవర్హౌస్ కాలనీలో సింగరేణి క్వార్టర్(టీ2-213)పై భారీ వృక్షం పడడంతో ఇల్లు ధ్వంసమైంది. రామగుండంలో పలు చోట్ల వృక్షాలు నేలవాలడంతో విద్యుత్ లైన్లు తెగిపోయాయి. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలో గాలిదుమారానికి పలువురి ఇండ్ల పైకప్పు, రేకులు కొట్టుకుపోయాయి. కొలనూర్లో కొంతసేపు రాళ్ల వాన పడింది. ఎన్టీపీసీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎన్టీపీసీ కాలనీలోని ఓదెల చంద్రమౌళికి చెందిన ఇంట్లోని మూడు గదుల రేకులు పూర్తిగా నేలమట్టం కాగా, ముప్పిడి రాజయ్య, ఓదెల రాయమల్లుకు చెందిన ఇంటి రేకులు విరిగిపోయాయి. రామగుండం పట్టణం ఆదర్శనగర్లో మాల మహానాడుకు చెందిన కమ్యూనిటీహల్ రేకులు గాలిలోకి విరిగిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్లో పశువుల పాక ముందు కట్టేసిన ఎద్దుపై చెట్టు పడి చనిపోయింది. మల్యాలలో కీర్తి వెంకటేశం రేకుల షెడ్డు ఈదురగాళ్లకు ఎగిరిపోయి సమీపంలోని పాఠశాల మైదానంలో పడిపోయింది. మర్రిగడ్డలో తాటి చెట్టు విరిగిపడి స్తంభాలపై పడడంతో గంట పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వీర్నపల్లి మండలం బాబాయిచెరువుతండాలో భూక్యా జగన్కు చెందిన గడ్డివాము పిడుగు పడింది. తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్లోని సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంతంలో భారీ మర్రి చెట్టు నేలకూలింది. అలాగే సిరిసిల్లలో సుమారు గంటకుపైగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాగా, జిల్లాలో ఒక్కసారి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతోపాటు భారీ వర్షం పడడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో సంబురంగా సాగుబాటకు సమయాత్తం అవుతున్నారు.