Rob works | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 17 : జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ సమీపంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ గడువు తరుముకొస్తున్నా.. పనుల్లో మాత్రం వేగం పుంజుకోవట్లేదు. రెండేళ్లుగా సాగుతున్న ఈ పనులు నత్తకే నడక నేర్పుతుండగా, ఈ ప్రాంతం గుండా రాకపోకలు కొనసాగించే వాహనదారులు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దుమ్ము ధూళిని అరికట్టే క్రమంలో ప్రస్తుతం వాహనాలు వెళ్తున్న మార్గంలో తారు రోడ్డు మాత్రం నిర్మించినా, ట్రాఫిక్ సమస్య తలెత్తినప్పుడు వాహనాల నుంచి విడుదలవుతున్న కాలుష్యం బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయని, పరిసర ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ – మంచిర్యాల రహదారి గుండా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే పెద్దపల్లి-కరీంనగర్- నిజామాబాద్ రైల్వేలైన్‌లో కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న కరీంనగర్-తీగలగుట్టపల్లి క్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి లేక వాహనదారులు దశాబ్ద కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో కొన్నేండ్లుగా రైళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో రైలు వచ్చి వెళ్లే సమయంలో క్రాసింగ్ వద్ద గేటు వేస్తుండగా, ఒక్కోసారి రైలు వచ్చి వెళ్లడానికి సుమారు 20 నుంచి 30 నిమిషాలు పడుతుండడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు.
పనుల్లో నిర్లక్ష్యం
బీఆర్ఎస్ ప్రభుత్వం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రైల్వే శాఖకు పలుసార్లు లిఖిత పూర్వకంగా విన్నవించింది. ఆలస్యంగానైనా స్పందించి ఆర్వోబీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావాలని సూచించడంతో అప్పటికప్పుడు తన వంతు వాటా కూడా గత బీఆర్ఎస్ప్రభుత్వం విడుదల చేసింది. ₹154 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల్లో 750 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పుతో వంతెన పనులు రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. 2023 జూలై 13న అప్పటి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్ కలిసి ఈ పనులకు శంకుస్థాపన చేశారు.
ఆరునెలల పాటు శరవేగంగా కొనసాగగా, అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడం, నిధుల విడుదలలో జాప్యం జరగడంతో పనులు నిలిచాయి. పిల్లర్ల పనులు ఒకవైపు పూర్తైనా.. మరోవైపు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆర్వోబీ నిర్మాణంపై అంతగా దృష్టి సారించక పోవటంతోనే గుత్తేదారు నిమ్మలంగా పనులు సాగిస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. పనులు మొదలై 20 నెలలు కావస్తున్నా, కనీసం ఇరవై ఐదు శాతం పనులు కూడా పూర్తి కాలేదు. గతేడాది జూలై నుంచి సాగుతున్న పనులతో ఇప్పటివరకు కేవలం ఒకవైపు మాత్రమే పిల్లర్లు వేయడం పూర్తైంది. వీటిపై స్లాబు నిర్మాణ పనులు కొద్దిదూరం పూర్తి చేసినా, మిగతా పిల్లర్లపై స్లాబ్ పనులు పూర్తి చేసేందుకు ఇంకెన్నాళ్లు పడుతుందో తెలియదు.
వాహనదారులకు తిప్పలు
ఈ మార్గంలో రోజూ వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారిపై ఉన్న ట్రాక్ గుండా గంటకోసారి గూడ్స్ రైళ్లు వెళ్తున్నాయి. దీంతో రోజుకు కనీసం పది నుంచి పదిహేను సార్లు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే, బ్రిడ్జి నిర్మాణ పరిసరాల్లో దుమ్ము, ధూళితో స్థానిక ప్రజలు నరకం చూస్తున్నారు. జిల్లాతోపాటు మంచిర్యాల, ఆదిలాబాద్, లక్షెట్టిపేట, తదితర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ఒకసారి రైల్వే గేటు వేస్తే తిరిగి తీసేందుకు కనీసం అర గంటకు పైగా సమయం పడుతున్నది. ఈలోగా ఇరువైపులా కిలోమీటర్ మేరకు ట్రాఫిక్ జాం అవుతుండగా, క్లియర్ కావడానికి మరో అరగంట దాకా పడుతున్నది. ఒక్కోసారి అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులు ట్రాఫిక్ లోనే మరణించిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.