Stop dirty politics | తిమ్మాపూర్,అక్టోబర్20: మానకొండూర్ నియోజకవర్గంలో బూతు రాజకీయానికి అంతం పలకాలని, నియోజకవర్గం పరువు తీస్తున్నారని, బూతు, బుద్ధి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారయణను హెచ్చరించారు. మండల కేంద్రంలోని కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడలేదని, ప్రజలకు ఏం చెప్తున్నారని విమర్శించారు. వినరాని మాట్లాడరాని భాషలో విలేకరులే సాక్ష్యంగా ముందుగా బూతులు మాట్లాడింది కవంపల్లేనని, ఆయన మాట్లాడిన తర్వాత రసమయి వాయిస్ మెసేజ్ పెడితే దాన్ని రాజకీయానికి వాడుకొని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు.
రాజకీయాల్లో హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలని హితువు పలికారు. ఇప్పటికైనా బూతు రాజకీయాలు మానుకోవాలని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. కవంపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండేళ్ల నుండి ఇప్పటివరకు మూడుసార్లు రసమయి ఇంటిపై దాడి చేయించారని.. మరోసారి చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గతంలో పనిచేసిన అందరూ అధికారులను పిలిపించుకొని డేటా తీసుకోవాలని, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అభివృద్ధి ఎంత చేసిండో తెలుస్తుందని సూచించారు.
రసమయి తలుచుకుంటే ఏమైనా చేస్తాడని ఎంతో బలగం ఉన్నదని తమ బలం చూడాలనుకోవద్దన్నరు. నీ వ్యవహార శైలిని చూసి కొత్తగా వచ్చిన నాయకులు సిగ్గుపడుతున్నారని అన్నారు. యువతకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ దీపావళి పండుగ నుండి అయినా తీరు మార్చుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఉల్లెంగుల ఏకనందం మాట్లాడుతూ చట్టసభల్లో చట్టాలను చేసే వ్యక్తులు మాట్లాడే భాషేనా ఇది అని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లాంటి వ్యక్తులను చూడలేదని అన్నారు. ఒక డాక్టర్ అయ్యుండి ఏం భాష అని విమర్శించారు. డాక్టర్ తో మాట్లాడితేనే సగం రోగాలు పోతాయి అంటారు.. కానీ కవంపల్లి మాట్లాడే మాటలు తో సగం రోగాలు ఎక్కువవుతాయి అన్నారు.
మీ చెత్త రాజకీయాల కోసం తల్లిని రోడ్డు కీడుస్తన్నారని విమర్శించారు. పదేళ్లపాటు మచ్చలేని నాయకునిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని, సీఎంకు దగ్గరగా ఉంటూ మంత్రుల కంటే ఎక్కువ అభివృద్ధి చేశారని కొనియాడారు. ఎస్సీ సెల్ నాయకుడు వంతడుపుల సంపత్ మాట్లాడుతూ, ముందుగా బూతులతో మాట్లాడరాని భాషలో మాట్లాడింది కవంపలేనని ఆయనే ఒప్పుకున్నాడని.. ఇదేంటని వాయిస్ మెసేజ్ లో ప్రశ్నించిన రసమయి వాయిస్ బయటికి పెట్టి సానుభూతి రాజకీయాల కోసం వాడుకుంటున్నారని అన్నారు.
ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, మార్చుకోకుంటే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసి నియోజకవర్గాన్ని దాటిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, యాదగిరి వెంకటేశ్వరరావు, పాశం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, వడ్లూరు శంకర్, సంగుపట్ల మల్లేశం, పొన్నం అనిల్ గౌడ్, సల్ల మహేందర్, బోయని తిరుపతి, గాళ్ళ శ్రీనివాస్, నోముల శ్రీనివాస్ గౌడ్, బోడిగా పరశురాములు, ఎడ్ల బుచ్చిరెడ్డి, సదయ్య, కృష్ణ, రమేష్, గాజ సాగర్ తదితరులు పాల్గొన్నారు.