ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Dharmaram | ధర్మారం, ఏప్రిల్ 4 : పేదలకు సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందేలా చర్యలు చేపట్టామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మండలంలోని కటికెనపల్లి, మేడారం గ్రామాలలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి ఆయన శుక్రవారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం ప్రజలంతా మంచి భోజనం చేయాలనే సంకల్పంతో సన్న బియ్యం సరఫరా ప్రారంభించిందని, ఒక వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా సరఫరా చేస్తున్నామని అన్నారు.
నూతన రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మేడారం గ్రామంలో అవసరమైన రోడ్డు, డ్రైయిన్ వంటి మౌలిక వస్తువులు కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందే విధంగా తాను స్వయంగా బాధ్యత తీసుకుంటున్నానని ప్రభుత్వ విప్ తెలిపారు.
కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ రేషన్ షాపులలో తెల్ల కార్డు దారులకు ఇక నుంచి ప్రతి నెల సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ధర్మారం మండలంలో 2 వేల 300 మంది రైతులకు వానాకాలంలో రూ.7 కోట్ల బోనస్ చెల్లించి సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామని, ప్రస్తుత యాసంగి సీజన్ లోను అదే విధంగా ఎటువంటి కోతలు లేకుండా బోనస్ చెల్లించి సన్న వడ్లు కొనుగోలు చేస్తామని అన్నారు.
నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎక్కడ క్వాంటిటీ లో తేడా రాకుండా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులు, రేషన్ డీలర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్ల నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిజిరెడ్డి తిరుపతిరెడ్డి, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.