Community Health Center | ధర్మారం, జులై3: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) భవనం ప్రారంభోత్సవానికి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ శ్రీధర్ వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీహెచ్సీ భవనం నిర్మాణం కోసం రూ.5.75 కోట్లు నిధులు మంజూరు కాగా 2023- జనవరిలో భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
ఈ క్రమంలో ఇటీవల భవనం పూర్తి కాగా ‘సీహెహెచ్సీ భవనం ప్రారంభం ఎప్పుడో’ అనే శీర్షిక ‘నమస్తేతెలంగాణ’ జూన్ 18న ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ శ్రీధర్ గురువారం నంది మేడారం లోని సిహెచ్సి భవనం ను పరిశీలించారు. భవనంలో పూర్తి చేసిన పనులను ఆయన పరిశీలించారు.
అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనం పనులు చివరి దశలో ఉన్నాయని ఆయన వివరించారు. మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ అంగీకరించాలని ఈ పనులు పూర్తి కాగానే భవనం ను వైద్య విధాన పరిషత్ ఆధీనంలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ భవనం పూర్తయిన క్రమంలో త్వరలో ప్రారంభానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ హెల్త్ సెంటర్ కి ఇప్పటికే డాక్టర్లు, వైద్య సిబ్బందిని కేటాయించిన నేపథ్యంలో వారిని ప్రస్తుతం జిల్లా వైద్య విధాన పరిషత్ సేవలకు వినియోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
దవాఖానలో అవసరమైన వైద్య సామగ్రి కేటాయింపు కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కు నివేదించామని అట్టి సామాగ్రి రాగానే దవాఖాన ప్రారంభానికి చర్యలు తీసుకొని ప్రజలకు వైద్య సేవలు అందడానికి సన్నాహాలు చేస్తున్నట్లు డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ప్రస్తుతం గైనిక్, పీడియాట్రిక్, అనస్తియా డాక్టర్లు ఈ దవాఖానలో అందుబాటులో ఉంటారని ఆయన వివరించారు.
ముఖ్యంగా 24 గంటల పాటు ప్రసూతి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దవాఖానకు ప్రత్యేకంగా హెచ్ఆర్ ను కేటాయిస్తామని ఆయన తెలిపారు. డాక్టర్ శ్రీధర్ వెంట స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుస్మిత, సిబ్బంది ఉన్నారు.