ధర్మపురి, ఫిబ్రవరి 26: రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం అమెరికా పయనం కానున్నారు. అమెరికాలోని ఉతా(UTA)నార్త్ సాల్ట్‌లేక్ సిటీలో ఫ్యామిలీ సెర్చ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరుగనున్న రూట్స్టెక్ -2023 ఎక్స్పో అనే కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. ఇనిస్టిట్యూషనల్ రిలేషన్షిప్ ఆసియా చీఫ్ రిప్రజెంటేటివ్ స్టీఫన్ ఎల్.రికేల్ రూట్స్ టెక్-ఎక్స్ పోకు ఆహ్వానించడంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ ల్యాటర్ డిసెన్స్ సంస్థ (ఎల్డీఎస్)సంస్థ ప్రతినిధులను కూడా కలువనున్నారు.
ఎల్డీఎస్ ప్రతినిధుల బృందం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో జగిత్యాల జిల్లా ధర్మపురి, పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలు, అంగన్వాడీల్లో అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర పథకాలపై ప్రశంసలు కురిపించారు. గ్రామాల్లో విద్య, వైద్య రంగాలకు తమవంతు సహకారమందిస్తామని అప్పట్లో మంత్రి ఈశ్వర్‌కు సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఈ మేరకు అమెరికాలో ల్యాటర్ డిసెన్స్ సంస్థ ప్రతినిధులతో మంత్రి సమావేశం కానున్నారు. విదేశీ బృందం ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి తెలంగాణ రాష్ర్టానికి ప్రయోజనం చేకూర్చే అంశాలపై మాట్లాడనున్నట్లు మంత్రి ఈశ్వర్ ఈ సందర్భంగా తెలిపారు.