సిరిసిల్ల తెలంగాణ చౌక్, సెప్టెంబర్ 9: ఉపాధ్యాయవృత్తి సమాజంలో అత్యంత గౌరవప్రదమైనదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో టీచర్లు స్కీల్స్ను పెంపొందించుకోవాలని సూచించారు. సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో ట్రస్మా సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీపీటీడీసీ చైర్మన్ గూడురి ప్రవీణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహరావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావుతో కలిసి వినోద్ కుమార్ హాజరై మాట్లాడారు.
ప్రైవేట్ స్కూళ్లలోని సమస్యలపై తనకు అవగాహన ఉన్నదని, తాను ఎంపీగా ఉన్నకాలంలో పరిష్కారానికి కృషి చేసినట్లు చెప్పారు. 15 ఏళ్ల క్రితమే ప్రైవేట్ టీచర్లకు వృత్తిని నిర్వర్తిస్తూనే టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పించేలా పార్లమెంట్లో చట్టం చేయాలని కోరానన్నారు. అయితే ఈ విషయంలో యాజమాన్యల నుంచి వ్యతిరేకత ఎదురైందన్నారు. సీఎం కేసీఆర్ ఆంగ్ల బోధనా విధానానికి పెద్దపీట వేస్తున్నారని, ఈ దిశగా గురుకులాలు, కేజీబీవీలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ స్కూళ్లల్లో సీట్లు దొరకని పరిస్థితులు వచ్చాయన్నారు. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో 70 కోట్ల మంది చిన్నారులు, యువత ఉండడం ఎంతో అదృష్టమని చెప్పారు.
ఇలాంటి పరిస్ధితుల్లో ప్రైవేట్ విద్యాసంస్థలు పిల్లలకు మెరుగైన విద్యనందించి వారి వికాసానికి కృషి చేయాలని కోరారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లకు పెద్దమొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నారని, కానీ చిన్నచిన్న స్కూళ్లు, కాలేజీల్లో బోధకులు చాలీచాలని జీతాలతో జీవితాలను వెళ్లదీసే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ టీచర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. వారికి హెల్త్‌కార్డులు, ఆరోగ్య రక్షణ కోసం పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల ప్రభు త్వం సుమారు 5600 టీచర్ల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసిందన్నారు. యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని టీచర్ ఉద్యోగాలు సాధించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల్లో మెరుగైన వాటా కోసం జరిగిందన్నారు. ఈ ట్యాగ్‌లైన్‌తో కేసీఆర్ ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించారని చెప్పారు.
గతంలో ఎస్సారెస్పీ మేజర్ నీటిపారుదల ప్రాజెక్టు ఉండేదని, కానీ కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత కాళేశ్వరంతో పాటు అనేక నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారని గుర్తుచేశారు. ఆంధ్రా పాలకు లు తెలంగాణ వస్తే కరెంట్‌లేక చీకటి మయమవుతుందని శాపనార్థాలు పెట్టారని గుర్తు చేశారు. కానీ, స్వరాష్ట్రంలో 7వేల యూనిట్లు ఉన్న కరెంట్ ఉత్పత్తిని 25 మెగావాట్లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. రాజన్నసిరిసిల్లలో గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు ట్రైనీ ఐఏఎస్‌లకు పాఠ్యాంశాలుగా మారడం మనందరికీ గర్వకారణమన్నారు. ఎంతో మేధోశక్తికలిగిన ఉపాధ్యాయులు సెలవుల్లో ప్రాజెక్టులను సందర్శించి అధ్యయనం చేయాలని సూచించారు.
తాను చదువుకునే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో 350 మెడిసిన్ సీట్లు మాత్రమే ఉండేవని, కానీ తెలంగాణ ప్రభుత్వం జిల్లాకో మెడికల్‌కాలేజీ నిర్మించి సుమారు 10వేల సీట్లను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. దీంతో ఏటా 10 వేల మంది డాక్టర్లుగా మారే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. లక్ష్మీనర్సింహరావు మాట్లాడుతూ, భావి భారత సమాజంలో ఉపాధ్యాయుల పాత్రకీలకమైందన్నారు. విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించడంలో వారికి బంగారు భవిష్యత్తును అందించాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా 170 మంది ఉపాధ్యాయలకు ఉత్తమ అవార్డులను అందజేశారు. ఇక్కడ మున్సిపల్‌చైర్‌పర్సన్ జిందం కళ, జిల్లా అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్‌గౌడ్, చిరంజీవి, దేవేందర్, ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు పల్లరాజురెడ్డి, రాజ్‌కుమార్ ఉన్నారు.