కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 21 : ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలకు సమ ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అన్ని మతాలకు సమాన ప్రతిపత్తిని కల్పించాలనే సదుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నదని, అన్ని పండుగలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఏసుక్రీస్తు కేవలం క్రైస్తవులకు మాత్రమే చెందినవారు కాదని, అన్ని కుల, మతాల్లో శాంతి స్థాపన కోసం పుట్టిన మహనీయుడని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ మార్ చర్చ్ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ క్రిస్మస్ వేడుకలు, బట్టల పంపిణీ కార్యక్రమానికి మేయర్ వై సునీల్‌రావు, ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఏ పండుగనైనా కొద్దిమంది మాత్రమే జరుపుకొంటే, డిసెంబర్ 25న ఇజ్రాయిల్ లోని బెత్లహాంలో పుట్టిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ పండుగగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకొంటారని తెలిపారు. ప్రపంచ శాంతి కోసం పుట్టిన మహనీయుడు చూపిన మార్గంలో అందరూ పయనించాలని, శత్రువులను మిత్రులుగా మార్చి వారు శాంతి మార్గంలో పయనించేలా ప్రేమను చూపాలన్నారు. గొప్ప చారిత్రక ప్రాశస్త్యం కలిగిన కరీంనగర్ జిల్లాలో సర్వమతాల వారు సోదర, సోదరీ భావంతో జీవిస్తున్నారని పేరొన్నారు. ఈ చారిత్రకమైన గొప్పనగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్ది భావితరాలకు అందించాలన్నారు.
ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, ఏసుక్రీస్తు మార్గాన్ని అందరూ అనుసరించాలని సూచించారు. పేదలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తామని పేరొన్నారు. ఈ కార్యక్రమంలో చివరగా లబ్ధిదారులకు దుస్తులు పంపిణీ చేసి కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్ కుమార్, డీడబ్ల్యూవో పులి మధుసూదన్, కార్పొరేటర్లు, సుడా డైరెక్టర్లు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజేషన్ కమిటీ బాధ్యులు తిమోతి జయరాజ్, క్రిస్టఫర్, కృపాదానం పాల్గొన్నారు.