వేములవాడ టౌన్, డిసెంబర్ 17: ఆమె కొండా సురేఖ కాదు.. కాసుల కోసం రాజన్న కోడెలను కబేళాలకు పంపిన సురేఖ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేశ్రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆమె కోట్లాది హిందువుల ఆచారాలు, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు. ఆమె కాశీకి వెళ్లినా.. గంగలో మునిగినా చేసిన పాపం పోదని, మహా నందీశ్వరుని శాపం తప్పదన్నారు. రాజన్న కోడెలను కబేళాలకు తరలించిన పాపానికి, పాప ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో మంగళవారం రాకేశ్రెడ్డి వేములవాడ రాజన్న ఆలయానికి చేరుకున్నారు. కోడెల ఆత్మశాంతి కోసం శాస్త్ర ప్రకారం ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో శాంతి హోమం నిర్వహించారు.
అనంతరం హనుమకొండ నుంచి తెచ్చిన నిజకోడెను స్వామివారికి సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, ఇతర సీనియర్ నాయకులతో కలిసి వేములవాడ గోశాలను శుద్ధి చేశారు. ఈ సందర్భంగా రాకేశ్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. శివుడి వాహనమైన నందినే కబేళాలకు తరలించి కాంగ్రెస్ పార్టీ తన గొయ్యితానే తీసుకున్నదన్నారు. వరంగల్ కూడా శైవ, ఆధ్యాత్మిక క్షేత్రమని 400 ఏండ్లు శివ భక్తులైన కాకతీయులకు రాజధానిగా విరాజిల్లిందన్నారు. అటువంటి ప్రాంతంలో జన్మించిన ఆడబిడ్డ కొండా సురేఖ ఓరుగల్లు పేరును కాపాడాల్సిందిపోయి.. రాజన్న కోడెలను కోతకు పంపి ప్రజల నమ్మకాన్ని, మనోభావాలను హత్య చేసిందని విమర్శించారు. అంతటి అపచారానికి ప్రాయశ్చిత్తంగా.. ఓరుగల్లు బిడ్డగా ఆ పరమశివుడికి శాంతి కలిగించడం కోసం శాంతిహోమం నిర్వహించినట్లు తెలిపారు. సురేఖను ప్రజలు క్షమించినా.. ఆ భగవంతుడు క్షమించడన్నారు.
కోడెల అమ్మకంలో ప్రధాన పాత్రదారులందరిపై పీడీయాక్ట్ నమోదు చేయాలన్నారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, లేదంటే నైతిక బాధ్యతగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోడెలు కబేళాలకు తరలిన అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి దేవుడిపై ఒట్లు వేసి మాట తప్పడంతో ములుగులో భూమి కంపించిందన్నారు. దేవుడి సొమ్ము, భక్తులు సమర్పించిన కానుకలు రూ.2కోట్లు దోచుకొని కాంగ్రెస్ విజయోత్సవ సభ నిర్వహించి రూ.32వేలకు ఒక్క బిర్యానీ చొప్పున వంద బిర్యానీలు తిన్నారని ఆరోపించారు. దేవుడి సొమ్ముకే రక్షణ లేదు.. ఇంకా ప్రజల సొమ్ముకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, గోలి మహేశ్, జోగిని శంకర్, బీఆర్ఎస్ నాయకులు రామతీర్థపు రాజు, కొండ కనకయ్య, ఈర్లపెల్లి రాజు, ముద్రకోల వెంకటేశం, నాయకులు పాల్గొన్నారు.