Siricilla | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జులై 14 : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) ఆధ్వర్యంలో మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పీఆర్సీ ప్రకటించకపోవడం, ఆరు డీఏలు పెండింగ్లో ఉంచడం, ఉద్యోగులు–ఉపాధ్యాయుల బిల్లులను చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేస్తోందని నాయకులు విమర్శించారు.
వెంటనే 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని, ఆరు డీఏలను విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, ఎస్ఎస్ఏ, మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, పెన్షనర్లకు రావాల్సిన ప్రయోజనాలను వెంటనే అందించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.
సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని టీపీటీఏ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు గసికంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి లెంకల జయకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శిలు ఓ జగన్మోహన్, కటుకం శ్రీనివాస్, జిల్లా బాధ్యులు ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, బాల్రెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.