రాయికల్, మే 1 : వరి కోతలు ప్రారంభమై నెల రోజులైనా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదంటూ రాయికల్ మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉప్పుమడుగు -ఆలూర్ ఎక్స్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యాన్ని ధోబీఘాట్ వద్ద కుప్పలు పోసి చాలా రోజులవుతున్నా అధికారులు ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదని మండిపడ్డారు. అకాల వర్షాలు పడి ధాన్యం తడిస్తే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న జిల్లా సహకార అధికారి సీహెచ్ మనోజ్ కుమార్, తహసీల్దార్ అబ్దుల్ ఖయ్యూం ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకొని వారితో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపి ఆందోళనను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పుమడుగు ప్యాక్స్ చైర్మన్ దీటి రాజరెడ్డి, వైస్ చైర్మన్ దుంపల స్వామిరెడ్డి, రైతులు దిండిగాల రామస్వామి, మాద రాజేశం, ముకెర నరేశ్, మల్లీక్ అహ్మద్, వెంకటేశ్, మహిపాల్, గంగాధర్, ఇస్మాయిల్, పల్లి మల్లయ్య, రాయమల్లు, భూమయ్య ముత్యాలు, అంజయ్య, నర్సయ్య, రాజు పాల్గొన్నారు.