Rachchapalli | ధర్మారం, ఫిబ్రవరి 15: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో శ్రీ సాంబమూర్తి రథోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి శ్రీ సాంబమూర్తి ఆలయంలో జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి ఆలయ ప్రాంగణంలో పార్వతీ పరమేశ్వరుడి ఉత్సవ విగ్రహాలను రథంపై ప్రతిష్టించి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం రథాన్ని భక్తులు లాగడంతో ఉత్సవం ప్రారంభమైంది. దీంతో పురవీధుల్లో స్వామివారి శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలయాన్ని దర్శించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగదేవత గుడిలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయం తరహాలో ఇక్కడ కోడెలను కట్టేసి భక్తులు స్వామి వారి మొక్కులు తీర్చుకున్నారు.
కాగా ఉదయం నుంచి భక్తులు శ్రీ సాంబమూర్తి దేవుడి దర్శనం కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పెర్క రవీందర్, కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ సూర రజిత వెంకటేశం, వార్డు సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
కాగా మండలంలోని నంది మేడారంలోని శ్రీ అమరేశ్వర స్వామి ఆలయం,ఖిలావనపర్తి గ్రామంలోని శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చి పరమశివుడి సన్నిధిలో భక్తులు మొక్కులు సమర్పించారు.