వేములవాడ టౌన్, జూలై 3 : వేద సంరక్షణలో భాగంగా దేశంలోనే తొలిసారిగా వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత చతుర్వేద స్మార్త పరీక్షలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. వేదసంరక్షణలో భాగంగా ఏడేండ్ల క్రితం వేములవాడ దేవస్థానం తరపున వేద శాస్త్ర స్మార్త ఆగమ పరిషత్ ట్రస్ట్‌ను స్థాపించి, ఆ ట్రస్ట్ ద్వారా వేద పాఠశాలను ఏర్పాటు చేసి చతుర్వేదములను విద్యార్థులకు బోధిస్తూ వేదాభివృద్ధికి కృషిచేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం నుంచి అఖిల భారత స్థాయిలో ఈ నెల 3 నుంచి 6వ తేదీ దాకా నాలుగు రోజులపాటు వేద, స్మార్త పరీక్షల నిర్వహణకు దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. దేశ నలుమూలల నుంచి 150 మంది వేద, స్మార్త విద్యార్థులు హాజరుకాగా, రాజన్న ఆలయ ఓపెన్‌స్లాబ్‌పై పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌లోని తుని పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. పరీక్షల నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ దువ్వూరి పణియజ్ఞేశ్వరసోమయాజి ఘనాపాఠి ఆధ్వర్యంలో తిరుపతి వేదిక్ యూనివర్సిటీ నుంచి ఆరుగురు పండితులు వచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ ఇన్చార్జి ఈవో రాధాబాయి, వేదపండితులు ఆంజనేయశర్మ, స్థానాచార్యులు నమిలకొండ ఉమేశ్, రాజేశ్వరశర్మ, గోపన్నగారి శివప్రసాద్, ఘనాపాఠి ఉన్నారు.
రాజన్న ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని తుని పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి పేర్కొన్నారు. రాజరాజేశ్వర వేద ఆగమ సంస్కృత విద్యాలయ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా స్మార్త పరీక్షలు నిర్వహించడం శుభపరిణామమన్నారు. రాజన్నను చాలాసార్లు దర్శించుకున్నానని, ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు, దర్శన భాగ్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్న అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.
దేశంలోనే తొలిసారిగా వేద విద్యార్థులకు చతుర్వేద స్మార్త పరీక్షలను వేములవాడలో నిర్వహించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తుని పీఠాధిపతికి ఈ ప్రాంత ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నానన్నారు. నాలుగు వేదాలు చదివే పాఠశాల ఒక్క వేములవాడ క్షేత్రంలోనే ఉందని వివరించారు. భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అని, హైందవ సంస్కృతిలోని వేదాలను ప్రపంచంలోనే ఇతర దేశాలు ఆచరిస్తున్నాయన్నారు.