Raginedu | పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 14 : పెద్దపల్లి మండలం రాగినేడులో వెలసిన స్వయంభూ నాగలింగేశ్వర స్వామి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దేవాలయంలో మహా శివరాత్రి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా నేతృత్వంలో అత్యంత వైభవంగా నిర్మించబడ్డ శ్రీ నాగ లింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 15 ఆదివారం నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబ చేశారు. మహాశివరాత్రి పర్వదినం రోజున తెల్లవారు జామున 3.45 కు స్వామివారికి మహా రుద్రాభిషేకం, 12 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, సాయంకాలం 4 గంటలకు శివపార్వతుల శోభాయాత్ర, రాత్రి పది గంటల నుంచి 12 గంటల వరకు స్వయంభు నాగలింగేశ్వర స్వామికి మహా రుద్రాభిషేకం, బిల్వార్చన, లింగోద్భవ కాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు.
పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలోని శ్రీ స్వయంభూ నాగలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుటకు గాను సకల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ పోతురాజుల భూమయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ గుమ్మడి విజయ్, సర్పంచ్ సోమ కుమార్ లు తెలిపారు.
మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవాలయంలో రెండు రోజులపాటు జరిగే పూజా కార్యక్రమాలలో ఆలయ నిర్మాణ కర్త, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా వారి సోదరులు కోలేటి శ్రీనివాస్ లు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భక్తులకు అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. రాగినేడు గ్రామప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్త గ్రామ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ ముక్కంటి ఆశీస్సులను అందుకోవాలని వాళ్లు విజ్ఞప్తి చేశారు.