Darmaram | ధర్మారం, మే 11: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ( రథోత్సవం) ఈనెల 13న నిర్వహించనుండగా ఉత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ కమిటీ చైర్మన్ పోలుదాసరి సంతోష్ ఆలయ ధర్మకర్తలు, ఆలయ ఈవో కొస్న కాంతా రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ప్రతీరోజు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ ఉత్సవాలను తిలకిస్తున్నారు. కాగా ఈనెల 13న స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా జాతర ఉత్సవానికి ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ పోలుదాసరి సంతోష్ తెలిపారు. భక్తులకు ఎండ దెబ్బ తగలకుండా ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేయించారు.
ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల దర్శనానికి ఆలయ గర్భగుడిలో మూలవిరాట్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని అర్చకులు సిద్ధం చేశారు. భక్తుల దర్శనం కోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈ నెల 13న జరిగే స్వామివారి జాతర మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి జయప్రదం చేయాలని ఆలే ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్, ఈవో కాంతారెడ్డి, ఆలయ ధర్మకర్తలు కోరారు.