గంభీరావుపేట/ మెట్పల్లి రూరల్, మే 23 : నాలుగైదు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి మొలకెత్తుతున్నది. దీంతో రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కొనుగోళ్లు, కాంటా వేసిన బస్తాలను తరలించడంలో జాప్యం చేస్తుండడంతో నష్టపోవాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట కొనుగోలు కేంద్రం వద్ద రైతులు మొలకెలెత్తుతున్న వడ్లను చూపిస్తూ.. కేంద్రానికి వడ్లు తీసుక వచ్చి నెల రోజులు అయితున్నదని, ప్రభుత్వం ఇప్పటి వరకు కొనకపోవడంతో తమ రెక్కల కష్టం వర్షం పాలవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలో స్థానిక పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండడంతో ఇటీవలి వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతున్నది. నెలరోజుల క్రితం తీసుకొచ్చినా.. ధాన్యం తేమ శాతం వచ్చినా ఇప్పటికీ కొనకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. వారం రోజుల క్రితం తూకం వేస్తామని చెప్పడంతో కొందరు ధాన్యాన్ని బస్తాల్లో నింపగా, వర్షానికి అవి తడిచి అందులోనే మొలకెత్తుతున్నది. దీంతో ధాన్యాన్ని మళ్లీ ఆరబెడితేనే తూకం వేస్తామని కేంద్రం నిర్వాహకులు తేల్చడంతో అన్నదాతలు ఆందోళనలో పడ్డారు. కొనుగోళ్లలో జాప్యం జరగడం వల్లే తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నేను రెండు నెలల కింద మామిడిపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో సన్నవడ్లు పోసిన. నాతో పాటు చాలా మంది రైతులు సెంటర్లో పోసిన్రు. నిర్వాహకులు ధాన్యం తూకం వేసి నిల్వ ఉంచిన్రు. అకాల వర్షాలతో ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసిపోతున్నాయి. ఇప్పటికే మూడుసార్లు తడిశాయి. నిర్వాహకులను బస్తాలను తీసుకెళ్లాలని అడిగితే మిల్లులు కేటాయించలేదని చెప్తున్నరు. కలెక్టర్ సారు స్పందించాలి. సన్నపు వడ్లను తరలించేలా చూడాలి.