Increase discipline | రుద్రంగి, సెప్టెంబర్ 12: క్రీడల వల్ల క్రమశిక్షణ పెరుగుతుందని, మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం అన్నారు. రుద్రంగి మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆటల పోటీలను ఎఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, మండల విద్యాధికారి రామకృష్ణతో కలిసి సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. గెలుపు ఓటములు సమానంగా స్వీకరించడానికి ఆటలు ఆడాలన్నారు. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.
మండల స్థాయిలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమ్మిరెడ్డి, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.