SP Ashok Kumar | కోరుట్ల, జూన్ 25: రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను బుధవారం సందర్శించిన ఎస్పీకి మెట్పల్లి డీఎస్పీ రాములు, సీఐ సురేష్ బాబు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని ఎస్పీ స్వీకరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన ఎస్పీ స్టేషన్ పరిసరాలను, కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్, క్రైమ్ రికార్డ్, ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్లను పరిశీలించారు.
సర్కిల్ పరిధిలో నమోదవుతున్న గ్రేవ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసుల్లో సీడీ ఫైల్స్, పెండింగ్ ట్రయల్స్ ఉన్న సీడీలను ఎస్సీ తనిఖీ చేశారు. గ్రేవ్, ఫోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఐ సురేష్ బాబుకి సూచించారు.
తరచుగా సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను తనిఖీ చేయాలని, సిబ్బంది పనితీరును నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలకు సైబర్ నేరాలు, వివిధ సామాజిక అంశాలు, సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇక్కడ డీసీఆర్బీ ఎస్ఐ శ్రీనివాస్, కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ ఎస్ఐలు, శ్రీకాంత్, శ్యామ్ రాజ్, నవీన్, రామచంద్రం, సుప్రియ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.