ధాన్యం కొనుగోళ్లపై ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలింది. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో రైతుల బాధను కళ్లకుగడుతూ ‘ఆగమవుతున్న రైతులు.. పత్తాలేని మంత్రులు’ శీర్షికన ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో యంత్రాంగం రంగంలోకి దిగింది. ఉమ్మడి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్ సోమవారం రావడమే కాదు.. కొత్తపల్లి, బొమ్మకల్, గర్రెపల్లి కేంద్రాల్లో ధాన్యాన్ని పరిశీలించారు. ఆ తర్వాత కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షించి, ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని, ఈ నెలాఖరు వరకు వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతన్నకు అండగా ఉండాలని, ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని సూచించారు.
కరీంనగర్, మే 20 (నమస్తే తెలంగాణ) : ఓవైపు అకాల వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా నడుస్తున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసినా ధాన్యపు రాశులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు వర్షాలుంటాయని వాతావారణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మబ్బులు కమ్ముకున్నా.. చిన్న చినుకు పడినా చాలు రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వానల కారణంగా ధాన్యం తడిసి తేమ శాతం పెరుగుతుండగా, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా, తాము పండించిన ధాన్యాన్ని కొనాలంటూ నేరుగా ఆందోళనలకు దిగుతున్నారు. అయినా, పట్టించుకునే వారు లేక.. ఉమ్మడి జిల్లా మంత్రులు కనీసం కన్తెత్తి చూడక మరింత కుంగిపోయారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల వేళ రైతులు పడుతున్న బాధలను,, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించిన ‘నమస్తే తెలంగాణ’ ఆదివారం (ఈ నెల 19న) ‘ఆగమవుతున్న రైతులు.. పత్తాలేని మంత్రులు’ శీర్షికన సమగ్ర కథనాన్ని ప్రచురించింది. దాంతో ఈ కథనంపై ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేకంగా చర్చించినట్లు స్పష్టమవుతున్నది.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్న తీరుపై ప్రచురితమైన ‘నమస్తే కథనం’ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సర్కారు ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కదిలింది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం రంగంలోకి దిగింది. ఉమ్మడి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న రాష్ట్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ కరీంనగర్ జిల్లాకు వచ్చారు. సాయంత్రం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆ తర్వాత సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో కేంద్రాన్ని పరిశీలించి, ఆయాచోట్ల నిర్వాహకులతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్లు కొన్నారు? అని తెలుసుకున్నారు. వెంటవెంటనే కొనుగోళ్లు చేస్తూ మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులతోనూ మాట్లాడారు. కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగారు. అనంతరం కరీంనగర్ కలెక్టరేట్‌కు చేరుకొని, ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షించారు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపెల్లి జిల్లాల వారీగా ధాన్యం కొనుగోళ్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇంకెంత ధాన్యం కేంద్రాలకు రావాల్సి ఉన్నది? ఎన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి? వందశాతం ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? రైతులకు త్వరగా డబ్బులు అందుతున్నాయా..? ఇంకా ఏమైనా ఇబ్బందులున్నాయా..? అని జిల్లాల వారీగా రివ్యూ చేశారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరుపై చర్చించి, మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. వర్షం వల్ల మొలకెత్తిన, తడిసిన ధాన్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, అలాంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు. ఈ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌కు ఉపయోగించేలా చూడాలని, ఈ మేరకు రైస్ మిల్లర్లకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు.
– జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్
ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలని, ఈ నెలాఖరు వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందశాతం కొనుగోళ్లు పూర్తి కావాలని అధికారులను ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. ఎకడా రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక దృష్టి సారించాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండాలని సూచించారు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తూ ధాన్యం అమ్మిన రైతులకు సత్వరమే డబ్బులు అందేలా చూడాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా అందుబాటులో ఉంచుకోవాలని, అలాగే ప్రభుత్వం నిర్దేశించిన కస్టం మిల్లింగ్ రైస్ డెలివరీ తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈప్రక్రియ దాదాపు వందశాతం పూర్తయ్యే లా అదనపు కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. ఈ సమావేశంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల అదనపు కలెక్టర్లు లక్ష్మీ కిర ణ్, శ్యాంప్రసాద్ లాల్, రాంబాబు, ఖీమ్యానాయక్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రజినీకాంత్, మారెటింగ్ అధికారి పద్మావతి, డీఆర్డీవో శ్రీధర్, తిమ్మాపూర్ తహసీల్దార్ కనకయ్య పాల్గొన్నారు.