కార్పొరేషన్, మార్చి 22: నగరాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులపై రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. బల్దియాల పరిధిలోని ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థల్లో పారిశుధ్యం విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజూ ఆయా సంస్థల్లో చేపట్టే పారిశుధ్య పనులకు సంబంధించిన సమాచారం మున్సిపల్ శాఖకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థల్లో పారిశుధ్యం విషయంలో మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రతి రోజూ ఆయా సంస్థల్లో పారిశుధ్య పనులు పూర్తి చేయడంతో పాటు రాష్ట్ర మున్సిపల్ శాఖకు ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు.
కరీంనగర్‌తో పాటు పట్టణాల పరిధిలోని విద్యా సంస్థల్లో ఎన్ని తరగతి గదులు ఉన్నాయి. ప్రతి రోజూ ఎన్ని తరగతి గదులను శుభ్రం చేస్తున్నారు, ప్రభుత్వ సంస్థలు ఎన్ని ఉన్నాయి, వాటిలో చేపడుతున్న పారిశుధ్య పనుల వివరాలను నివేదించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ఆదేశాలతో అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా ఆయా సంస్థల సమీపంలో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు పెరిగితే వెంటనే తొలగిస్తున్నారు. అలాగే, మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థల్లోని సెప్టిక్ ట్యాంక్‌లను సఫాయి మిత్ర సురక్షా చాలెంజ్ కింద క్లీన్ చేయాలని ఆదేశాలు రావడంతో వీటిపై కూడా మున్సిపల్ అధికారులు దృష్టి సారిస్తున్నారు. జిల్లాలోని కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో తమ పరిధిలోకి వచ్చే ప్రభుత్వ సంస్థలు ఎన్ని ఉన్నాయి. వాటిలో ఏ మేరకు సెప్టిక్ ట్యాంకులు ఉన్నాయన్న లెక్కలు తీసే పనిలో నిమగ్నమయ్యారు. వాటి లెక్కలు తెలిన తర్వాత నెల రోజుల్లోగా సెప్టిక్ ట్యాంక్‌లను క్లీన్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీల పరిధిలో పారిశుధ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.