Collector Koya Sri Harsha | పెద్దపల్లి, నవంబర్ 6 : ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో చదువులో వెనకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వాహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, విధులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ట్యూటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వసతి గృహాల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా సంక్షేమ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సంక్షేమశాఖ అధికారులు సమయ పాలన, విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి ఎం రవీందర్, సహాయ సంక్షేమ అధికారి శ్రావణ్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.