వేములవాడలోని కొన్ని అద్దె గదులు, లాడ్జిలు నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. నిర్వాహకులు అత్యాశకు పోయి ఎలాంటి వివరాలు తీసుకోకుండానే గదులు కేటాయిస్తుండడంతో వికృత చేష్టలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల గుర్తుతెలియని దుండగులు బెదిరింపులకు దిగి బలవంతపు వసూళ్లకు పాల్పడడం కలకలం రేపింది. ఇలా ఎన్నో ఘటనలు జరుగుతున్నా.. కొన్ని మాత్రమే పోలీస్ స్టేషన్ వరకు వస్తున్నాయి. భయభ్రాంతులకు లోనయ్యే వ్యక్తులు మాత్రం.. అయిందేదో అయిపోయిందనుకొని జారుకుంటున్న ఘటనలూ ఉంటున్నాయి.
వేములవాడ, మే 18: వేములవాడ ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కొందరు ఒక్కరోజు ఇక్కడే ఉండి మొక్కులు సమర్పిస్తుంటారు. అయితే విడిది చేసే భక్తుల కోసం పట్టణంలో దాదాపు 400కు పైగా అద్దె గదుల భవనాలు వెలిశాయి. ఈ సముదాయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి. లాగ్ బుక్ మెయింటన్ చేయాలి. విడిది కోసం గదిని ఇచ్చే సమయంలో సంబంధిత వ్యక్తుల ఫొటో ఉన్న గుర్తింపు కార్డు జిరాక్స్, ఫోన్ నంబర్లు తీసుకోవాలి. అనుమానాస్పదంగా అనిపిస్తే పోలీసులకు సమాచారం కూడా ఇవ్వాలి. కానీ, కొందరు నిర్వాహకులు అత్యాశకు పోయి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ విషయంలో పలుసార్లు పోలీసులు హెచ్చరిస్తున్నా లెక్కచేయడం లేదు. కేసులు పెట్టి బెదిరిస్తున్నా వైఖరి మారడం లేదు. అద్దె గదులు వికృతి చేష్టలకు అడ్డాలుగా మారుతున్నాయి. కుటుంబంతో సహా వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తల్తెత్తతున్నాయి.
ప్రైవేట్ అద్దె గదుల్లో విడిది చేసే వారి వివరాలను నమోదు చేయడంలో నిర్వాహకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. అధిక డబ్బులకు ఆశపడి అసాంఘిక కార్యకలాపాలకు కేటాయిస్తున్న తరుణంలో ఏదైనా ఘటనలు జరిగినప్పుడు పోలీస్ శాఖ నివ్వెరపోయే పరిస్థితి వస్తున్నది. వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్లో పదేళ్ల క్రితం ఏకంగా స్టువర్టుపురం దొంగల ముఠా 15 రోజులపాటు అద్దె గదులు తీసుకొని ఉమ్మడి జిల్లాలో దొంగతనాలు చేసిన తీరు అప్పటి పోలీస్ శాఖను ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక మరోవైపు ఓ మైనర్ జంటకు ఆశ్రయం కల్పించగా హైదరాబాద్ పోలీసులు వచ్చి తనిఖీలు చేసి కేసు నమోదు చేయడం కలకలం రేపింది. ఏడాది క్రితం అద్దె గదుల్లో ఓ మహిళ హత్యకు గురికాగా, అప్పుడు నిందితులను పట్టుకోవడం సవాల్‌గా మారింది.
కొద్ది నెలల క్రితం ఓ వివాహితతో వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందగా, సదరు వివరాలను కూడా సేకరించడంలో తలనొప్పిగా మారింది. ఇక ఇటీవలే అద్దె గదిలో దిగిన ఓ జంటను పోలీసులమని చెప్పి బెదిరింపులకు పాల్పడి నగదును కాజేయడమే కాకుండా, సదరు జంటపై అసభ్యంగా ప్రవర్తించిన తీరు ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే, అద్దె గదుల భవనంలో సీసీ కెమెరాలు పనియేయకపోవడంతో జరిగిన ఘటనను గుర్తించడం కూడా సవాల్‌గా మారుతున్నది. అయితే, గది ఇచ్చే సమయంలో వివరాలు తీసుకోవడంలో కొందరు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా రాజన్న సన్నిధికి కుటుంబంతో దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలని భక్తులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.
నిబంధనలు పాటించని ప్రైవేట్ అద్దె గదులు, లాడ్జి నిర్వాహకులపై కఠినంగా వ్యవహరిస్తాం. అసాంఘిక కార్యకలాపాలు, ఇతర వాటికి అద్దె గదులు ఇస్తే ఇప్పటికే నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తున్నాం. తప్పనిసరిగా సంబంధిత వ్యక్తుల ఫొటో గుర్తింపు కార్డు, ఫోన్ నంబర్లు కూడా నమోదు చేయాలని ఇప్పటికే సూచించాం. సీసీ కెమెరాలు పనితీరు కూడా సక్రమంగా ఉండాలని హెచ్చరించాం. పెడచెవిన పెట్టే వారిపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తాం.
– వీర ప్రసాద్, సీఐ (వేములవాడ )