పెద్దపల్లి, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి టౌన్/ ధర్మారం/ పెద్దపల్లి రూరల్ : మహిళలను మహరాణులను చేస్తున్నామని, అందులో భాగంగా ఏడాదికి 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను ఇస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను ఇవ్వడంతోపాటు మహిళా సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతామని చెప్పారు.
శనివారం ఆయన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ధర్మారం మండలం కటికెనపల్లిలో 33/11 కేవీ సబ్‌స్టేషన్, జూలపల్లి మండలం కాచాపూర్‌లో 132/33 కేవీ సబ్ స్టేషన్, పెద్దపల్లి మండలం రాఘవపూర్‌లో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆఫీస్, రంగాపూర్‌లో 33/11 కేవీ సబ్ స్టేషన్, పెద్దపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయ భవనం, అమృత్ 2.0 కింద తాగు నీటి పథకం, టీయూఎఫ్ఐడీసీ కింద మొత్తంగా 85 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో వెల్గటూర్ మండలానికి చెందిన భూములు కోల్పోయిన 126 మందికి 18 కోట్ల విలువైన జంబో చెకును అందజేశారు. ధర్మారంలోని మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంతోపాటు పెద్దపల్లిలోని జెండా చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని కాచాపూర్‌లో మహిళా సంఘాలతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ విద్యుత్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. అందుకు గాను కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగు నీటిని అందించేందుకు 10 వేల కోట్లతో పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని, ఒక పైలెట్ ప్రాజెక్టు కింద నందిమేడారం తీసుకొని ఇక్కడి రైతులందరికీ ఉచిత సోలార్ పంపుసెట్లు అందించడంతోపాటు విద్యుత్ ఉత్పత్తి చేపట్టి గ్రిడ్‌కు అనుసంధానం చేసి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.
2029-30 నాటికి థర్మల్ పవర్ మాత్రమే కాకుండా గ్రీన్, హైడ్రో, ఫ్లోటింగ్ సోలార్, సోలార్ పవర్ మొత్తంగా 50 వేల మెగావాట్ల కరెంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ మంజూరు చేశామని, అతి తొందర్లోనే భూమి పూజ చేస్తామన్నారు. పత్తిపాక రిజర్వాయర్‌ను బడ్జెట్లో పెట్టి నిధులు ఇచ్చామని, సర్వే పూర్తి కాగానే ప్రారంభిస్తామని, పాలకుర్తి లిఫ్ట్, బండల వాగు లిఫ్ట్ కోసం సబ్ స్టేషన్లు మంజూరు చేసి, మరో 30 వేల ఎకరాల సాగు పెంచుతామన్నారు.
పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో బైపాస్ రోడ్లు నిర్మిస్తామన్నారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆ దిశగా సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం 2 లక్షల రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే 18 వేల కోట్లు ఏక కాలంలో మాఫీ చేశామని చెప్పారు. ఇంకా కొంతమందికి కావలసి ఉందని బ్యాంకుల్లో సాంకేతిక కారణాలవల్ల జాప్యం జరుగుతుందని వివరించారు.
తమ మంత్రి వర్గమంతా సమష్టిగా పనిచేస్తూ కేవలం ఎనిమిది నెలల్లోనే మార్పు తీసుకువస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. అసలు రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను అప్పుడు, ఇప్పుడు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనేనని, పత్తిపాకను పూర్తి చేస్తామని, టాస్క్ బిల్డింగ్‌ను పూర్తి చేశామని చెప్పారు. పెద్దపల్లి నియోకవర్గంలో ఇళ్లు లేని 3500 మందికి ఈ యేడాది అందిస్తామన్నారు. ఓదెల మానేరుపై వంతెన నిర్మిస్తామని చెప్పారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో గొప్పగా పనిచేసే అదృష్టం లభించిందన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల్లో 18 ఏళ్లు నిండిన యువకులకు ఇచ్చే పరిహారం, ఇంకా ఇతర నిర్వాసితులకు రావాల్సిన 8 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.