Jeevan Reddy | జగిత్యాల, జూలై 11 : కాంగ్రెస్ పార్టీతో సామాజిక న్యాయం లభిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో నిర్ణయించడం పై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి తాటి పర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకులు, సంబురాలు నిర్వహించారు. స్థానిక ఇందిరా భవన్ లో శుక్రవారం టపాసులు పేల్చి, నినాదాలు చేస్తూ ఇందిరా భవన్ నుండి స్థానిక తహసీల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ జెండాలు పట్టుకొని, నినాదాలు చేస్తూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయం తోనే అభివృద్ధి సాధ్యమని బలహీన వర్గాల హక్కుల సాధన కోసం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. ఎన్నికల ప్రణాళికలో కామారెడ్డి డిక్లరేషన్ లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ తెర పైకి తీసుకువచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుల గణన చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారనీ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చేసేందుకు రాష్ట్ర శాసన సభలో తీర్మానం చేసి ఆమోదించడంతోపాటు శాసన మండలి లో ఆమోదం చేసి కేంద్రానికి పంపినారని తెలిపారు.
బలహీన వర్గాల ప్రజలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీ ఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి నివేదించారనీ, బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు 9 వ షెడ్యూల్ లో చేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉండగా, చలనం లేదన్నారు. ఏ బిల్లుపై అయినా మూడు నెలల్లోపూ నిర్ణయం చెప్పాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేటికి కేంద్ర ప్రభుత్వం తన వైఖరి ప్రకటించలేదన్నారు. చట్టపరంగా బలహీన వర్గాల జనాభా పరంగా హక్కులు కల్పించేలా కృషి చేయాలని, బీసీ రిజర్వేషన్ పెంపుపై భారత సమాజం హర్షం వ్యక్తం చేస్తుందని, రాహుల్ గాంధీ ఆలోచన విధానం బలహీన వర్గాల ప్రజలకు హక్కులు కల్పించేలా ఎన్ని కుట్రలు చేసినా రిజర్వేషన్ అమలు ఆగేది లేదు అని స్పష్టం చేశారన్నారు.
గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు కాగా, తెలంగాన రాష్ట్ర ఏర్పాటు అనంతరం 22 శాతం కుదించబడిందన్నారు. గత ప్రభుత్వం జగిత్యాల మండల పరిషత్ అధ్యక్ష పదవి బలహీన వర్గాలకు కేటాయించినా చట్టంలోని సాంకేతిక లోపాలు సవరించలేదనీ, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, చట్టంలో మార్పులు చేసి, బలహీన పార్టీ హక్కులు కాపాడామని స్పష్టం చేశారు. ప్రపంచంలో అగ్రగామిగా నిలువడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగమీ కారణమని, రాజ్యాంగ విలువలను కాపాడినవారే నిజమైన భారత పౌరులన్నారు.
రాజ్యాంగాన్ని కాపాడితేనే సామాజిక న్యాయం సాధ్యం అవుతుందని, బలహీన వర్గాల ప్రజలకు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టామని, బలహీన వర్గాల హక్కుల రక్షణ కోసం కట్టుబడి ఉన్నామని, రాహుల్ గాంధీ ఆలోచన విధానం అందరికీ ఆదర్శమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఆటంకాలు సృష్టిస్తే బలహీన వర్గాల ద్రోహిగా మిగిలి పోతారన్నారు. సామాజిక న్యాయం సాధన దిశగా నా వంతుగా కృషి చేస్తానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు