Ramagundam | కోల్ సిటీ, జూలై 12 : ఇదిగో.. రామగుండం బల్దియా పనితనానికి పరాకాష్టనే ఈ చిత్రం. గోదావరిఖని బజార్ ప్రాంతంలో ఇటీవల నిర్మించిన పుట్ పాత్ ల మన్నిక చూడండీ.. ఒకవైపు నిర్మాణం జరుగుతుండగానే.. మరోవైపు కుంగిపోతుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రధాన వ్యాపార కేంద్రాల్లో ఫుట్ పాత్ ల నిర్మాణం చేపట్టిన నగర పాలక సంస్థ వాటి నాణ్యత విషయంలో మాత్రం చూసీ చూడనట్టుగా వ్యవహరించడంతో ప్రజాధనం రోడ్డు పాలవుతోందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. అశాస్త్రీయంగా నిర్మిస్తున్న ఈ ఫుట్ పాత్ లు ఎవరి ప్రయోజనం కోసమని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే రామగుండం బల్దియా కార్యాలయం నుంచి వన్ టౌన్ ఠాణా వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపుల సుమారు రూ.2 కోట్ల వ్యయంతో గతంలో నిర్మించిన ఫుట్ పాత్ లు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురై ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాలకు అడ్డాగా మారాయనీ, ఈ నేపథ్యంలో నగరంలోని లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ లో ఆగమేఘాల మీద కొత్తగా నిర్మిస్తున్న ఈ ఫుట్‌పాత్‌ల నిర్మాణం పూర్తి కాకముందే అప్పుడే కుంగిపోతుండటం అధికారులు, కాంట్రాక్టర్ పనితీరుకు అద్దం పడుతుందని విమర్శిస్తున్నారు. ఒకవేళ ఫుట్‌పాత్ నిర్మాణం పూర్తయినా భవిష్యత్ లో అవి కూడా ఆక్రమణలకు గురికావని గ్యారంటీ ఉందా..? అని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. బజార్ కు వివిధ అవసరాల కోసం వచ్చే వినియోగదారుల సౌలభ్యం కోసం నిర్మించడం బాగానే ఉన్నప్పటికీ, ప్రజాధనం దుర్వినియోగం గాకుండా నాణ్యతతో కూడిన పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మేయర్, కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.