Godavarikhani | కోల్ సిటీ, మే 7: రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం లో గురువారం ఓ నాగుపాము హడలెత్తించింది. కార్యాలయంలోని శానిటేషన్ విభాగం పక్కన భారీ పొడవాటి విష సర్పం కలియతిరిగింది. శానిటేషన్ విభాగం కిటికీలో నుంచి లోపలికి దూరెందుకు ప్రయత్నించింది. సిబ్బంది కదలికలు ఉండడంతో కొద్దిసేపు అటు ఇటు తిరిగి వెనకాల నిరుపయోగంగా ఉన్న ఇనుప పైపుల కుప్పలోకి వెళ్లింది. ఇదిలా ఉండగా కార్యాలయం వెనకాల చెట్లపొదలు, స్క్రాప్, నిరుపయోగంగా మూలకుపడ్డ వాహనాలు ఉండటంతో పాములు, తేళ్లు, ఇతర విష కీటకాలకు ఆవాసంగా మారింది.
తరచుగా పాములు బయటకు వచ్చి కలియ తిరుగుతూ వెళ్తుంటాయని ఇది సాధారణ విషయమని కార్మికులు చెప్తుండడం గమనార్హం. కాగా, కార్యాలయం ఆవరణలో పారిశుద్ధ్య కార్మికుల వాహనాలు , వివిధ పనుల నిమిత్తం కార్యాలయం కు వచ్చే పౌరుల వాహనాలు పార్కింగ్ చేసి ఉంటాయి. విష సర్పాలు బయటకు వచ్చినప్పుడు వాహనాల్లోకి దూరి ఉంటె పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పేరుకు అద్దాల మేడగా ఉన్నా పాములకు మాత్రం ఆవాసాలుగా మారడం కార్మికులను భయాందోళనకు గురిచేస్తుంది. కార్యాలయం వెనుక ఉన్న స్క్రాప్ ను, చెట్ల పొదలు , నిరుపయోగంగా పడేసిన పరికరాలను తొలగిస్తే ఇంకెన్ని పాములు బయటకు వస్తాయోనని వాపోతున్నారు.