జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో శుక్రవారం జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృత్యు ఒడికి చేరారు. చిన్నమ్మ ఇంటికెళ్లొస్తూ ఇద్దరు.. ఒగ్గు కథ చెప్పేందుకు వెళ్లి ఒకరు.. పుట్టిన రోజు అమ్మమ్మ ఇంటికెళ్లొస్తూ ఇంకొకరు.. అతనివెంటే ఉన్న సోదరుడు.. బస్సు కోసం వేచి చూస్తూ ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. అనుకోని మరణాలతో ఆయా కుటుంబాల్లో పండుగపూట విషాదం నెలకొన్నది.
జగిత్యాల రూరల్/పెద్దపల్లి రూరల్, సుల్తానాబాద్, జనవరి 10 : జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన బత్తుల జలపతి-విజయ దంపతుల కుమారుడు సాయి(20), బూతగడ్డ ప్రభాకర్-జమున కొడుకు అరవింద్(20) స్నేహితులు. వీరిద్దరు అరుణాచల్, తిరుమల పుణ్యక్షేత్రాలకు వెళ్లి రెండు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నారు. సోమన్పెల్లిలో ఉండే తన చిన్నమ్మకు శుక్రవారం ప్రసాదం అందించి తిరిగి తన స్నేహితుడు అరవింద్‌తో కలిసి సాయి బైక్‌పై వస్తున్నాడు. తక్కళ్లపెల్లి శివారులో జగిత్యాల నుంచి ధర్మపురి వైపు వెళ్తున్న మేడిపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన వంశీ(25) బైక్ ఎదురెదురుగా ఢీకొని, అరవింద్, వంశీ అక్కడికక్కడే మృతిచెందారు.
తీవ్రంగా గాయపడిన సాయిని స్థానికులు జగిత్యాల జిల్లా దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఒగ్గు కథ కళాకారుడైన దయ్యాల వంశీ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. తక్కళ్లపెల్లిలో ఓ ఇంట్లో ఒగ్గు కథ చెప్పేందుకు వెళ్తున్న వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగి ముగ్గురు యువకులు చనిపోవడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ప్రమాద స్థలాన్ని ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందర్ పరిశీలించారు. జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ సదాకర్ యువకుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం జగిత్యాల జిల్లా దవాఖానకు తరలించారు.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేటకు చెందిన చుంచు రాజ్‌కుమార్ (23) తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పెద్దపల్లి మండలం అప్పన్నపేటలోని చిన్నమ్మ కుటుంబసభ్యులను కలిసేందుకు వచ్చాడు. అక్కడి నుంచి తన చిన్నమ్మ కొడుకైన అనవేని అభినవ్ (17)తో కలిసి కమాన్‌పూర్ మండలం గుండారంలోని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రంగాపూర్ వద్ద మంథని వైపు వెళ్తున్న ట్రాన్స్‌కోకు చెందిన బొలెరో వాహనం, వీరి బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బైక్ నడుపుతున్న రాజ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, బైక్ వెనుకాల కూర్చున్న అభినవ్‌కు తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు చికిత్స కోసం పెద్దపల్లికి అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని బసంత్‌నగర్ ఎస్ఐ స్వామి సిబ్బంది పరిశీలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన కల్వల ఈశ్వరమ్మ (45) నారాయణపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద బస్సు కోసం వేసి చూస్తునన్నది. ఇదే సమయంలో కరీంనగర్ వైపు నుంచి అతి వేగంగా వస్తున్న లారీ ఓ బైక్‌ను క్రాస్ చేస్తూ అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లి బోల్తా కొట్టింది. ఆ సమయంలో లారీ, పక్కనే ఉన్న కరెంట్ స్తంభం మధ్యన అక్కడే ఉన్న ఈశ్వరమ్మ ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే, నారాయణపూర్‌కు చెందిన మరో మహిళ వేల్పుల సూరమ్మ తలకు, చేతులకు గాయాలు కాగా, బైక్ నడిపిన పెర్కపల్లికి చెందిన శ్రీనివాస్ గాయపడ్డారు. వారిని సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ఈశ్వరమ్మ కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రావణ్‌కుమార్ తెలిపారు.