మానకొండూర్, మార్చి 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సబ్బండవర్గాలను నిండా ముంచిందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలుకు ఒక్క రూపాయి కూడా కేటాయించక పోవడంపై మండిపడ్డారు. అబద్ధపు హామీలు, మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్‌ను అడుగడుగునా నిలదీద్దామని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సోమవారం మానకొండూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పత్రాలను పార్టీ శ్రేణులతో కలిసి దహనం చేశారు.
ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆరు గ్యారెంటీలకు ఘోరి కట్టిందన్నారు. డిక్లరేషన్లకు పాతర వేసిందని, సంక్షేమ పథకాలను సమాధి చేసిందని మండిపడ్డారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రకటించి వారిని కూటికి లేనివారిగా చేస్తున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగినా.. అక్కడికి మహిళా సంఘాల సభ్యులను తరలించడం అందుకు నిదర్శనమన్నారు. విద్యార్థినులకు స్కూటీలు, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, మహిళలకు 2,500 గ్యారెంటీ పేరుతో వారిని మహా మోసం చేసిందన్నారు. 15వేల రైతు భరోసా, పంటలకు 500 బోనస్ పేరుతో రైతున్నలను, రైతు కూలీలు, కౌలు రైతులను దగా చేసిందని మండిపడ్డారు. 4వేల నిరుద్యోగ భృతి, 2లక్షల ఉద్యోగాలు, 5లక్షల విద్యాభరోసా కార్డు పేరుతో విద్యార్థి, యువతను ధోకా చేసిందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్బండవర్గాలకు ద్రోహం చేసిందని విమర్శించారు. కార్మికులను వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. బడ్జెట్లో ఆరు గ్యారెంటీలకు తూట్లు పొడిచి ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ సర్కార్‌ను అడుగడుగునా నిలదీస్తూ ప్రభుత్వ వైఖరిని పల్లెపల్లెకూ తీసుకుపోదామని వెల్లడించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ జడ్పీటీసీ, పార్టీ మండలాధ్యక్షుడు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, శాతరాజు యాదగిరి, ఆడప శ్రీనివాస్, గుర్రం కిరణ్‌గౌడ్, పిట్టల మధు, దండబోయిన శేఖర్, పాశం అశోక్‌రెడ్డి, రాయికంటి కిరణ్, రాచకట్ల వెంకటస్వామి, బొల్లం అనిల్, పిండి సందీప్, రాజుయాదవ్ పాల్గొన్నారు.