ఎన్నికల ముందు ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఇప్పుడు చేతులెత్తేస్తున్నది. మ్యానిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు ప్రకటించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించి, తీరా అమలు చేసేందుకు అనేక కండిషన్లు పెడుతున్నది. ఈ ఎనిమిది నెలల్లో ఒకటి, రెండు పథకాలను అమలు చేయడమే తప్ప, మెజార్టీ గ్యారెంటీలను విస్మరించింది. నెలలు గడుస్తున్నా దరఖాస్తులు పరిష్కారం కాక అర్జీదారులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ఇప్పటికైనా స్పందించి, అర్హులందరికీ పథకాలు వర్తింపజేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
పెద్దపల్లి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలనలో గ్యారెంటీల కోసం ప్రభుత్వం గతేడాది డిసెంబర్, జనవరి మొదట్లో ప్రజాపాలన పేరిట ఆరు రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించింది. పెద్దపల్లి జిల్లాలోని 13మండలాలు, ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాల్టీల నుంచి మొత్తంగా 2,40,667 దరఖాస్తులు అందాయి.
ఆ తర్వాత తిరిగి ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలను ఏర్పాటు చేసి గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ కోసం 23,396 దరఖాస్తులను పరిశీలించి గ్యాస్ అకౌంట్ నంబర్లను, విద్యుత్ యూఎస్సీ నంబర్లను సరిచేశారు. ఇవి తప్ప ఇతర దరఖాస్తులన్నీ బుట్టదాఖలయ్యాయనే విమర్శలు ఉన్నాయి.
మహాలక్ష్మీ పథకంలో మహిళలకు ప్రతి నెలా 2500 జీవన భృతి కోసం 19,9571మంది, 15వేల రైతు భరోసా కోసం 88,011 మంది రైతులు, 11,374మంది కౌలు రైతులు, రైతు కూలీలకు ఏడాదికి 12వేల సాయం కోసం 1,02,364మంది, గృహలక్ష్మి పథకం కింద ఇండ్ల కోసం 1,85,404మంది, 250 గజాల ఇంటి స్థలం కోసం 403 మంది అమరవీరుల కుటుంబాలు, 2707మంది ఉద్యమకారులు, చేయూత పథకం కింద సాయం 6979 మంది, ఇతర పెన్షన్ల కోసం 49,552, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి 15,670 మంది చేసుకున్న దరఖాస్తులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి.
కాళ్లరిగేలా తిరిగినా ఫలితం శూన్యం
ప్రజా పాలనల దరఖాస్తుల డేటా ఎంట్రీలో చాలా వరకూ లోపాలు దొర్లాయి. దీంతో అర్హులైన అనేక మందికి ప్రభుత్వ పథకాలు అందకుండా పోయాయి. పరిష్కారానికి ప్రభుత్వం జిల్లాలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయాలు, రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలతో పాటు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే సదరు కేంద్రాలు కేవలం దరఖాస్తులు స్వీకరించి, ఆన్లైన్ చేయడం తప్ప, పథకాలు మాత్రం అమలు చేయలేదు. దీంతో ఆరు గ్యారెంటీల కోసం వేలాది మంది దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు.
ప్రజావాణితోపాటు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ మినహా ఇతర ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో అమలు చేస్తరా..? లేదా .. ఉత్తమాటలేనా..? అని చర్చించుకుంటున్నారు. అన్ని అర్హతలున్నా ఎందుకు అమలు చేయడం లేదని వాపోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హామీలన్నీ నెరవేర్చాలని కోరుతున్నారు.
నిర్లక్ష్యం.. మహిళకు శాపం
‘మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఎరుకలగూడెంకు చెందిన ఓ మహిళ ఆరు గ్యారెంటీల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న. తన కుటుంబ సభ్యులతో ఉన్న రేషన్ కార్డు, కరెంట్ బిల్లు, గ్యాస్ సిలిండర్ బుక్ జిరాక్స్ ప్రతులతో పాటు పూర్తి వివరాలతో ప్రభుత్వానికి సమర్పించింది. అధికారుల నిర్లక్ష్యంతో ఆన్లైన్లో తప్పుగా నమోదు చేయడంతో పథకాలు అందకుండా పోయాయి. అయితే కొద్దిరోజుల క్రితం మంథని మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రాన్ని ప్రారంభించడంతో తనకు గృహాజ్యోతి, 500కే గ్యాస్ పథకాలను వర్తింపచేయాలని పలుసార్లు దరఖాస్తు చేసుకున్నది. కానీ ప్రయోజనాలు మాత్రం దక్కడంలేదు. ఇప్పటికీ నెల నెలా కరెంట్ బిల్లు వస్తున్నదని, గ్యాస్ సబ్సిడీ రావడం లేదని సదరు మహిళ వాపోతున్నది.