Jailer 2 | తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించిన ఈ చిత్రం దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తలైవా కెరీర్లోనే బెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. దీంతో ఇప్పుడు సీక్వెల్ ‘జైలర్ 2’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట ఈ సినిమాను జూన్ 12న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం రిలీజ్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. షూటింగ్ చివరి దశలో ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్స్ వంటి కారణాలతో విడుదల తేదీ మారవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారన్న టాక్ వినిపిస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఈ సీక్వెల్లో మొదటి భాగంలో నటించిన కీలక తారాగణమే మళ్లీ కనిపించనున్నారు. రజనీకాంత్‌కు జోడిగా రమ్యకృష్ణ నటించగా, ముఖ్య పాత్రల్లో ఎస్ జే సూర్య, యోగి బాబు, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తుండగా, సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మొదటి భాగంలో విగ్రహాల దొంగల ముఠాతో ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కుటుంబానికి ఎదురైన సమస్యలు, ఆ ముఠా నాయకుడితో జరిగిన తలపడి కథ ముగిసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు సీక్వెల్లో చూపించనున్నట్లు సమాచారం.
ఇక ఆగస్ట్ 21 రిలీజ్ టాక్ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే రోజున నేచరల్ స్టార్ నాని నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ది ప్యారడైజ్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో పలుభాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ రెండు సినిమాలు ఒకే రోజున విడుదలైతే బాక్సాఫీస్ వద్ద హీట్ పెరగడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.