Vitamin B12 | మన శరీరానికి అవసరమయ్యే బి కాంప్లెక్స్ విటమిన్లలో విటమిన్ బి12 కూడా ఒకటి. దీనిని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే విటమిన్. విటమిన్ బి12 మన శరీరంలో ముఖ్య విధులను నిర్వర్తిస్తుంది. నాడీ కణాల నిర్మాణంలో, ఎర్ర రక్తకణాల నిక్మాణంలో, డీఎన్ఏ సంశ్లేషణకు ఈ విటమిన్ చాలా చాలా అవసరం. శరీరంలో విటమిన్ బి12 లోపించడం వల్ల మనం అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. ఈ విటమిన్ లోపాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మనం తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. విటమిన్ బి12 ఉండే ఆహారాలను తీసుకోకపోవడం, జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేకపోవడం, రక్తహీనత ఎక్కువగా ఉండడం, ఉదర కుహర వ్యాధులు ఎక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల శరీరంలో విటమిన్ బి12 లోపం తలెత్తుతుంది.
విటమిన్ బి12 లోపించినప్పుడు మనం శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఈ హెచ్చరికలను ముందుగానే గుర్తించడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురి కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. విటమిన్ బి12 లోపాన్ని హెచ్చరికల ద్వారా శరీరం ఏ విధంగా తెలియజేస్తుందో.. ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో విటమిన్ బి12 లోపించడం వల్ల గాయాలు త్వరగా నయం అవ్వవు. విటమిన్ బి12 లోపించడం వల్ల ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో శరీరానికి ఆక్సిజన్, రక్తం సరఫరా తగ్గుతాయి. దీంతో గాయాలు నయం అవ్వడానికి సమయం ఎక్కువగా పడుతుంది. విటమిన్ బి 12 లోపించడం వల్ల పాదాల్లో జలదరింపు ఎక్కువగా ఉంటుంది. పాదాల్లో తిమ్మిర్లు, నరాలు దెబ్బతినడం, నడవడం కష్టంగా మారడం వంటి లక్షణాలు విటమిన్ బి12 లోపాన్ని సూచిస్తాయి.
వీటితో పాటు విటమిన్ బి12 లోపించడం వల్ల అలసిపోయినట్టుగా, శరీరం బలహీనంగా ఉన్నట్టు ఉంటుంది. వికారం, వాంతులు లేదా విరేచనాలు అవుతాయి. ఆకలి తగ్గడం, శరీర బరువు తగ్గడం కూడా జరుగుతుంది. ఇవే కాకుండా నోరు నొప్పిగా ఉండడం, చర్మం సున్నితంగా మారడం, నాడీ సంబంధిత సమస్యలు తలెత్తడం, కంటిచూపు మందగించడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. విటమిన్ బి12 లోపించడం వల్ల మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి. ఆందోళనగా, గందరగోళంగా ఉంటుంది. చికాకు, డిప్రెషన్ వంటి సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మనం ప్రవర్తించే తీరు కూడా మారుతుంది.
ఇటువంటి లక్షణాలను బట్టి మన శరీరంలో విటమిన్ బి12 లోపం ఉందని గ్రహించాలి. వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఈ సమస్యతో బాధపడే వారికి ముందుగా సప్లిమెంట్స్ ను సూచిస్తున్నారు. సమస్య తీవ్రతను బట్టి వారానికి ఒక విటమిన్ బి12 ఇంజెక్షన్ ను కూడా సిఫార్సు చేస్తారు. ఇక వీటితో పాటు విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. విటమిన్ బి12 ఎక్కువగా మాంసాహారంలో ఉంటుంది. గుడ్లు, చేపలు, మాంసం, లివర్, పీతలు, పుట్టగొడుగులు, పాలు, పాల పదార్థాలు, టోఫు వంటి ఆహారాల్లో విటమిన్ బి12 ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల విటమిన్ బి12 లోపం తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.