RBI Currency Update : దేశంలో ప్రస్తుతం ఎక్కువగా వినియోగిస్తున్న కరెన్సీ రూ.100, రూ.500. అయితే, ఈ నోట్లు త్వరలో మారబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది కరెన్సీ నోట్ల విషయంలో కీలక మార్పులు తీసుకునే ఆర్బీఐ రూ.100, రూ.500 నోట్లలో మార్పులు తీసుకురానుంది. అలాగని పాత నోట్లను ఆర్బీఐ రద్దు చేయడం లేదు. కాబట్టి, వినియోగదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు.
మార్కెట్లో చెలామణిలో ఉన్న నోట్ల విషయంలో సెక్యూరిటీ, ఎక్కువ కాలం మన్నిక వంటి అంశాల్లో ఆర్బీఐ సమీక్ష చేస్తుందనే సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రూ.100, రూ.500 నోట్లలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా ఈ నోట్లు చెలామణిలో ఉండటంతో కొన్ని చిరిగిపోవడం, రంగు పాలిపోవడం, ప్రింటెడ్ ఫీచర్లు సరిగ్గా కనిపించకపోవడం, సెక్యూరిటీ ఫీచర్లను గుర్తించలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే నకిలీ నోట్లు కూడా చెలామణిలో ఉన్నాయి. దీంతో కొత్తగా మరింత సెక్యూరిటీ కలిగిన నోట్లను తీసుకురానున్నారు. రూ.100 నోట్లకు సంబంధించి రీ డిజైన్ అంటూ లేదు కానీ, పాత నోట్లలోనే కొన్ని కొత్త మార్పులు చేస్తారు. ప్రింట్లో నాణ్యత, ఇంకు ఎక్కువ కాలం ఉండటం, వాటర్ మార్క్స్, సెక్యూరిటీ థ్రెడ్ను మరింత నాణ్యతగా తీర్చిదిద్దుతున్నారు.
దీనివల్ల ఆ నోట్లను ఒరిజినలా కాదా అని సులభంగా గుర్తించవచ్చు. ఎక్కువ కాలం మన్నేలా, మడత పెట్టినా త్వరగా పాడవకుండా ఉండేలా ఈ నోట్లు ఉంటాయి. ముఖ్యంగా నోట్ల లైఫ్ టైం పెరిగేలా చేస్తున్నారు. దీనివల్ల తరచూ కొత్త నోట్లు ముద్రించాల్సిన ఖర్చు తగ్గుతుంది. కొత్త నోట్లు పాత డిజైన్లోనే ఉన్నా.. ప్రతి డీటైలింగ్ సులభంగా, స్పష్టంగా గుర్తించేలా ఉంటుంది. రూ.500 నోట్లకు సంబంధించి డిజైన్లో స్వల్ప మార్పులున్నాయి. నోట్ల కలర్ మరింత స్పష్టంగా, మైక్రో డీటైల్స్తో రానున్నాయి. కొత్త నోట్లతో ఏటీఎంలలో కూడా ఎలాంటి సమస్యలు రావని ఆర్బీఐ చెబుతోంది. పాత నోట్లతోపాటు, కొత్త నోట్లను కూడా ఏటీఎంలలో యాక్సెప్ట్ చేస్తారని తెలిపింది. ప్రజలు కొత్త నోట్లతోపాటు పాతవాటిని కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కొత్త నోట్లలో ప్రధానంగా సెక్యూరిటీ పరమైన మార్పులే కనిపిస్తాయి.