రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కే నీరజ చేస్తున్న విచారణపై విమర్శలు వస్తున్నాయి. ఓ ఉన్నతాధికారిగా విచారణ చేయడం అభినందనీయమే అయినా.. విచారణ సాగుతున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ అవినీతి జరిగిందని కథనాలు వచ్చాయో.. అదే కార్యాలయానికి కొంత మందిని పిలిపించి, అందులోనూ అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి విచారణ చేసిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. ఉద్యోగులపై ఆరోపణలు వస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీ హెచ్చరించడం గమనార్హం.
కరీంనగర్ అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు వేములవాడలోని ట్రెజరీ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. ఆయా కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి, పని పూర్తిచేయాలంటే టార్గెట్ పెట్టి వసూలు చేస్తున్న తీరు, లంచాలు తీసుకోవడానికి ఏసీబీకి చిక్కకుండా ఫోన్‌పే, గూగుల్‌పే వాడడం వంటి అనేక అంశాలను బహిర్గతం చేసిన విషయం విదితమే. ఈ కథనాలు సంచలనం రేపుతుండగా, ఇప్పటికీ చాలా మంది బాధితులు ‘నమస్తే’కు ఫోన్ చేస్తూ తమ బాధను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కే నీరజ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మూడు రోజుల క్రితమే మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ మేరకు సోమవారం వేములవాడలోని ఎస్టీవో కార్యాలయానికి వచ్చి విచారణ జరిపారు. పెన్షన్ యూనియన్ ప్రెసిడెంట్‌తోపాటు మరికొంత మందిని ఇక్కడికే పిలిచి విచారణ సాగించారు. ఆ శాఖ ఉన్నతాధికారిగా సదరు శాఖపై వచ్చిన కథనాలపై స్పందించి, విచారణ చేయడం అభినందనీయమే అయినా.. విచారణ సాగిన తీరుపైనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఎస్టీవో కార్యాలయానికి కొంత మందిని పిలిచి, అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి వివరాలు ఆరా తీశారు. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో జరిగిన అక్రమాలు చెప్పడానికి ఎవరూ సాహసించరు. ఎందుకంటే ఒకవేళ వాస్తవాలు చెబితే సదరు సమాచారం తిరిగి అధికారులకు చేరి భవిష్యత్‌లో తనకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఏ బాధితుడు కూడా ఇతరుల ముందు తనకు జరిగిన నష్టాన్ని, అన్యాయాన్ని, అధికారుల ద్వారా పడ్డ ఇబ్బందులను చెప్పడానికి ఇష్టపడడు. అందులోనూ అదే కార్యాలయంలో విచారణ జరపడం వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్న బాధితులు తమ బాధలు చెప్పుకొందామని ఉన్నా ఆ కార్యాలయం దరిదాపుల్లోకి రారు. ఎందుకంటే విచారణకు ఎవరూ వచ్చారన్న విషయం వెంటనే సదరు అధికారులకు తెలిసిపోతుందని.
నిజానికి అవినీతి బయటకు రావాలంటే.. విచారణ అధికారులు ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలను ‘నమస్తే తెలంగాణ’ కథనాల్లోనే ప్రచురించింది. మార్చి నుంచి రిటైర్మెంట్ అయి.. పింఛన్ కోసం ట్రెజరీ కార్యాలయాలకు వచ్చిన జాబితాలను తీసుకొని, వారి నుంచి వివరాలు సేకరిస్తే జరిగిన అన్యాయంతోపాటు సమర్పించుకున్న ముడుపుల వివరాలను చెప్పడానికి ఆస్కారం ఉంటుందని, విచారణ కూడా పారదర్శకంగా జరిగేలా చూసినప్పుడే బాధితులు ముందుకొస్తారని కథనాల్లో స్పష్టంగా ఉన్నది. నిఘా విభాగాల అధికారులు ఈ క్రమంలోనే తమ తమ విచారణ సాగిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఇదే తరహాలో ముందుకెళ్తే చాలా మేరకు సమాచారం వచ్చేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, సోమవారం విచారణకు వస్తున్నట్టు కార్యాలయానికి పిలిచిన వారికి తప్ప.. మిగిలినవారికి సమాచారం లేదని తెలుస్తున్నది. మార్చి నుంచి రిటైర్మెంట్ అయిన వారితోపాటు ఇటీవల వేములవాడ ఎస్టీవో కార్యాలయం ద్వారా జరిగిన లావాదేవీలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఫలానా తేదీ రోజు విచారణ ఉంటుందని ఒక సంక్షిప్త మెసేజ్ పంపిస్తే.. అందరికీ సమాచారం తెలిసేందుకు అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ అనేది రహస్యంగా జరగాలే తప్ప.. అందరినీ ఒకే చోటకు చేర్చడం వల్ల అసలు బాగోతం బయటకు ఎలా వస్తుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అవినీతి ఆరోపణలు వస్తే శాఖా పరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఏడీ హెచ్చరించారు. సోమవారం విచారణ జరిపిన అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సిటిజన్ ఛార్ట్ ప్రకారం పనులు పూర్తి చేయాలని ఆదేశించిన ఏడీ గ్రామ పంచాయతీ చెక్కులు, డీఏ బిల్లులు, పెన్షన్లు, ఇతర బిల్లులను ఆలస్యం చేయకుండా పాస్ చేసి, ఈ కుబేర్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అనంతరం అఫీస్ కార్యాలయ రికార్డులను తనిఖీ చేసినట్టు తెలిపారు.