శాంతిభద్రతల పరిరక్షణకు విశేషంగా కృషిచేస్తున్న సిరిసిల్ల పోలీస్‌శాఖ, మహిళలకు అభయం ఇస్తున్నది. అత్యవసర సమయాల్లో ఆటోలు, క్యాబ్‌ల్లో ప్రయాణించే వారి భద్రతకు భరోసా కల్పించేందుకు సాంకేతిక అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నది. రాష్ట్రంలోనే మరెక్కడా లేనివిధంగా ‘మీ భద్రతే మా లక్ష్యం’ అనే ట్యాగ్‌లైన్‌గా ‘అభయ్'(సేఫ్ ఆటో) మొబైల్ అప్లికేషన్‌ను తీసుకువచ్చింది. ప్రయాణ సమయాల్లో ఆకతాయిగా వ్యవహరించే డ్రైవర్ల ఆటకట్టించేందుకు జిల్లాలోని 3వేల వాహనాలకు క్యూ ఆర్‌కోడ్‌తో కూడిన యూనిక్ నంబర్స్ ఏర్పాటు చేసింది. మహిళలకు ఏ మాత్రం ఇబ్బంది అనిపించినా యాప్ సాయంతో స్కాన్ చేస్తే చాలు క్షణాల్లో పోలీసులు స్పాట్‌కు వచ్చేలా రూపొందించిన ఈ యాప్ మంగళవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందుబాటులోకి వచ్చింది.
– తెలంగాణ చౌక్, మే 3
స్కాన్ చేస్తే చాలు..
ప్రయాణికులను ఆటో రిక్షాలు, క్యాబ్ డ్రైవర్లు తప్పుదోవ పట్టించి మార్గం మళ్లించినా, అసభ్యంగా ప్రవర్తించినా, మద్యం తాగి వాహనం నడిపినా, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మందిని ఎక్కించుకున్నా, ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లు అనిపించినా వెంటనే మీ మొబైల్ ఫోన్లోని అభయ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఆయా వాహనాల్లో పోలీస్‌శాఖ ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. వెంటనే మీరు ప్రయాణిస్తున్న వాహనం యొక్క లైవ్ లోకేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతుంది. వెంటనే పోలీసు సిబ్బంది అప్రమత్తమై వాహనాన్ని ట్రేస్ చేసి దగ్గరల్లో ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం ఇస్తారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని ఆకతాయిల పని పడతారు. ఇలా జరుగబోయే నేరాలను కట్టడి చేయడంలో ఈ అప్లికేషన్ కీలకంగా పనిచేస్తుంది.
ఇలా ఉపయోగించాలి..
అభయ్(సేఫ్ ఆటో) అప్లికేషన్ చాలా ఈజీగా ఉపయోగించవచ్చు. కానీ ముందుగా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ప్రమాద సమయాల్లో యాప్‌ను ఓపెన్ చేసి పోలీసు శాఖ అమర్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ముందుగా డ్రైవర్ ఫొటో, వివరాలతోపాటు వాహనానికి సంబంధించిన వివరాలు వస్తాయి. తర్వాత ఎమర్జెన్సీ కాల్/టెక్ట్స్ మెస్సేజ్, ఎమెర్జెన్సీ కైంప్లెంట్, రేటింగ్ అనే మూడు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ప్రమాదంలో ఉన్నట్లు అనిపించితే ఎమర్జెన్సీ కాల్/టెక్ట్స్ మెస్సెజ్ లేదా కైంప్లెట్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఆ వెంటనే మీ కంప్లయింట్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్తుంది. అయితే ఈ యాప్ ద్వారా ఫిర్యాదులే కాదు ప్రయాణ టైంలో డ్రైవర్ సేవాభావం, ఆపద సమయాల్లో స్పందించే విధానం మీకు నచ్చినట్లయితే రేటింగ్ కూడా ఇవ్వవచ్చు. ప్రతి సర్వీస్ వాహనంలో ఈ క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల తప్పు చేసేందుకు డ్రైవర్లు సైతం భయపడే అవకాశం ఉంటుంది. ప్రయాణికులకు సైతం తాము సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతామనే నమ్మకం కలుగుతుంది.
శాంత్రి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా వినూత్న కార్యక్రమాలతో ముందుకుసాగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం, మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆటోలు, క్యాబ్‌ల్లో ప్రయాణించే మహిళల భద్రతకు ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక చొరవతో ‘మీ భద్రతే మా లక్ష్యం’ అనే ట్యాగ్‌లైన్‌తో అభయ్ (సేఫ్ ఆటో) యాప్‌ను రూపొందించింది.
వాహనాల్లో క్యూఆర్ కోడ్లు..
ఆపద సమయాల్లో మహిళల రక్షణకు యాప్‌ను తెచ్చిన పోలీసుశాఖ, జిల్లాలోని 3వేల ఆటోరిక్షాలు, క్యాబ్‌లు ఉన్నట్లు గుర్తించింది. ప్రతి సర్వీసెస్ వాహనాల యజమానుల నుంచి అవసరమైన డాక్యుమెంట్లు, డ్రైవర్ వివరాలు, ఇతర సమాచారం సేకరించి, డిజిటలైజ్ చేసింది. యూనిక్ నెంబర్లు కేటాయించింది. క్రోడీకరించిన సమాచారం మొత్తం క్యూఆర్ కోడ్ రూపంలో తీసుకువచ్చి, సదరు వాహనాల్లో అతికించింది.
మహిళ సురక్షిత ప్రయాణం కోసం
జిల్లాలోని మహిళలు సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ యాప్‌ను ఆవిష్కరించాం. ఆపద సమయాల్లో అభయ్ యాప్‌ను సద్వినియోగం చేసుకొని జరుగబోయే ప్రమాదాలను నివారించవచ్చు. మహిళల్లో చైతన్యం ఉంటేనే పోకిరీలు, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది. అత్యవసర సమయాలు, రాత్రి, పగటి పూట ప్రయాణాల్లో భద్రత కల్పించడం కోసమే ఈ అధునాతన యాప్‌ను రూపొందించాం. యాప్ ద్వారా రవాణాలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా వాహనం యొక్క లైవ్లోకేషన్ను ట్రెస్ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ అధికారుల ద్వారా ప్రమాదాన్ని అరికట్టవచ్చు.
– అఖిల్ మహాజన్, సిరిసిల్ల ఎస్పీ
ప్రయాణికుల భద్రతకు దోహదం
ఆటో, క్యాబ్ ప్రయాణ సందర్భాల్లో తోటి ప్రయాణికులు, డ్రైవర్ల నుంచి ఇబ్బందులు ఎదురైతే రక్షణకు అభయ్ అప్లికేషన్ ఎంతగానో తోడ్పడుతుంది. ప్రతి ఆటో రిక్షా, క్యాబ్ సర్వీస్ వాహన యాజమాన్యం వివరాలను సేకరించి క్యూఆర్ కోడ్‌లో పొందుపరిచి, వాహనాల్లో అమర్చాం. వాహన చోదకుడు అసభ్యంగా ప్రవర్తించినా, మద్యం తాగి వాహనం నడిపినా, నిబంధనలకు విరుద్దంగా ఎక్కవ మందిని తీసుకెళ్తున్నా ప్రయాణికులు కైంప్లెంట్ చేయవచ్చు. ఇలాంటి నూతన ఆవిష్కరణల ద్వారా ప్రమాదాలను నివరించవచ్చు. అలాగే ప్రయాణికులకు క్షేత్రస్థాయిలో భరోసా వస్తుంది.
– రాజు, ట్రాఫిక్ ఎస్ఐ (సిరిసిల్ల)
కేటీఆర్ చేసిన ట్వీట్
ఎస్పీకి మంత్రి అభినందనలు..
సాంకేతికతను ఉపయోగించి ప్రజారవాణాను సురక్షితంగా చేయడం హర్షణీయమని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను అభినందించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మీని స్టేడియంలో యాప్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ప్రయాణమార్గాల్లో ఎలాంటి అవాంతరాన్ని అయినా ఎదుర్కొనే భరోసానిచ్చేలా రూపొందించిడం గొప్ప చొరవ అంటూ జిల్లా ఎస్పీకి ప్రశంసల జల్లు కురింపించారు.