రాజన్న సిరిసిల్ల, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : ఆది నుంచీ గులాబీ కంచుకోటగా ఉన్న సిరిసిల్ల క్షేత్రంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయభేరి మోగించింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి వరుసగా గెలుస్తూ.. మూడోసారి హ్యాట్రిక్ సాధించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా.. ఇక్కడ మాత్రం గులాబీదే హవా నడుస్తున్నది. తాజాగా సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. ఐదేళ్లకోసారి జరిగే ఈ పాలకవర్గ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని, పట్టు కోసం విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహం ఫలించి, 12 స్థానాల్లో ఎనిమిదింటిని అభ్యర్థులే కైవసం చేసుకుని బీఆర్ఎస్ సత్తా చాటింది. గురువారం జరిగిన అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో 12 డైరెక్టర్ స్థానాల్లో 8 స్థానాలను గెలుచుకోగా, శుక్రవారం బ్యాంకు కార్యాలయంలో చైర్మన్, వైస్‌చైర్మన్ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా చైర్మన్ స్థానానికి రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్‌చైర్మన్ స్థానానికి అడ్డగట్ల మురళి నామినేషన్ దాఖలు చేశారు.
ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థుల నుంచి నామినేషన్ దాఖలు కాకపోవడంతో.. చైర్మన్‌గా రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్‌చైర్మన్‌గా అడ్డగట్ల మురళి ఏకగ్రీవమయ్యారు. సహకార సంఘాలలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో ఇప్పటి వరకు మూడుసార్లు గులాబీ పార్టీ అభ్యర్థులకే ఓటర్ల పట్టం కడుతూ వస్తున్నారు. ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఎన్నికైన అభ్యర్థులకు కేటీఆర్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఇటు చైర్మన్, వైస్‌చైర్మన్ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం విజయోత్సవ సంబురాలు చేసుకున్నారు. చైర్మన్, వైస్‌చైర్మన్‌తో పాటు డైరెక్టర్లందరినీ ఒకే వాహనంపైకి చేర్చి సిరిసిల్ల పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. గాంధీ, అంబేద్కర్, నేతన్న విగ్రహాలకు పూలమాల వేశారు. గెలిచిన అభ్యర్థులందరికీ పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టీఎస్‌టీపీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్‌చైర్మన్ చిక్కాల రామారావు, నాయకులు చీటి నర్సింగరావు, బొల్లి రామ్మోహన్, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ గాజుల నారాయణ పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.