రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ విద్యుద్దీకరణలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (కో ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లయ్ సొసైటీ సెస్) 1970 నవంబర్ 1న ప్రారంభమైంది. సభ్యుల వాటాధనంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థను కలుపుకుని ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం తొమ్మిది సహకార విద్యుత్ సరఫరా సంఘాలుండేవి. కాలక్రమేణా అవన్నీ బోర్డులో విలీనమయ్యాయి. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని సంస్థను బోర్డులో కలుపకుండా, సహకార సంస్థగా కొనసాగేలా కృషి చేశారు. జిల్లా ప్రజల కోరిక మేరకు ‘సెస్’ను కాపాడుతూ వస్తున్నారు. నేడు మెరుగైన సేవలందిస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. పలుసార్లు అవార్డులు కూడా అందుకున్నది. ప్రస్తుతం సెస్ పరిధిలో సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. 13 మండలాల్లోని 255 గ్రామ పంచాయతీల్లో సేవలందుతున్నాయి. 2014కు ముందు 2,32,5501 కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం 2,72,5501 ఉన్నాయి.
సెస్.. ట్రాన్స్‌కో నుంచి విద్యుత్ కొనుగోలు చేసి తన పరిధిలోని వినియోగదారులకు విక్రయిస్తున్నది. ఏడాదికి 926 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్న ఈ సంస్థ, అన్ని రంగాలకూ సరఫరా చేస్తున్నది. అందులో వ్యవసాయ రంగానికి 630, గృహాలకు 158, వాణిజ్యం 26, పరిశ్రమలు 36, మరమగ్గాలకు 27, వీధి దీపాలు 5, నీటి సరఫరా 12, సాధారణం 2 మిలియన్ యూ నిట్లను విక్రయిస్తున్నది. కాగా, నాడు విద్యుత్ సరఫరాలో నాణ్యత లేకపోవడం, సరిపడా విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయకపోవడంతో వ్యవసాయ రంగం, పరిశ్రమలకు కరెంటు కష్టాలు తప్పలేదు. రోజుకు నాలుగు గంటల కరెంటు సరఫరా చేసినా అది కూడా లోవోల్టేజీతో మోటర్లు కాలిపోయేవి. దీంతో రైతులు, పరిశ్రమల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయేవారు. కరెంటు సమస్యతో వ్యవసాయంతోపాటు టెక్స్టైల్స్ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది.
గతంలో రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ నుంచి జిల్లాకు కరెంట్ సరఫరా చేసేందుకు దుర్శేడ్ వద్ద 220 కేవీకి అనుసంధానం చేశారు. అక్కడ ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే సిరిసిల్ల జిల్లాలో అంతరాయం కలిగేది. ఎప్పుడు కరెంట్ ఉండేదో పోయేదో తెలిసేది కాదు. స్వరాష్ట్రంలో మంత్రి కేటీఆర్ ఈ సమస్యకు పరిష్కారం చూపా రు. 100 కోట్లతో సిరిసిల్ల 220కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేయించారు. సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరులో దీనిని ఏర్పాటు చేశారు. అలాగే నాడు రెండు మూడు మండలాలకు ఒక సబ్‌స్టేషన్ ఉంటే.. తెలంగాణ వచ్చిన తర్వాత సగటున రెండు మూ డు గ్రామాలకో సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయించారు. 33/11కేవీ సబ్స్టేషన్లు 27 మంజూరు చేయించారు. ఒక్కో సబ్‌స్టేషన్‌కు 1.50 కోట్ల నుంచి 2కోట్ల చొప్పున 40కోట్లకుపైగా ఖర్చు చేశారు. రాష్ట్రం రాక ముందు 48 మాత్రమే ఉన్న ఈ సంఖ్య, రాష్ట్రం వచ్చిన ఎనిమిదేళ్లలో 75కు చేరింది. అదనంగా 132/33 కేవీ సబ్స్టేషన్లు నాలుగు ఏర్పాటు చేయడంతో వీటి సంఖ్య 8కి చేరింది. ఒక్కోదానికి 30 కోట్ల చొప్పున 120 కోట్ల దాకా ఖర్చు చేశారు. మొత్తంగా 260 కోట్లతో కరెంట్ సమస్యలను దూరం చేశారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఒరిగి, విరిగి పోయిన స్థితిలో ఉన్న స్తంభా లు, వేలాడుతూ ప్రాణాంతకంగా మారిన విద్యుత్ వైర్లను సరిచేసేందుకు 7.42 కోట్లను మంజూరు చేసింది. అందులో మిడిల్ పోల్స్ 3528, చెడిపోయిన స్తంభాల స్థానంలో కొత్తగా 4954 వేశారు. థర్డ్‌వైర్ 483కిలోమీటర్లు సరిచేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి ముందు వ్యవసాయరంగ విద్యుత్ కనెక్షన్లు 40వేలుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 73,735కి చేరింది. విద్యుత్ వినియోగం కూడా 200 మిలియన్ యూనిట్ల నుంచి 630 మిలియన్ యూనిట్లకు చేరింది. రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు ప్రకటించారు. 24గంటల ఫ్రీ కరెంటుతో పంటల సాగు విస్తీర్ణం బాగా పెరిగి, విద్యుత్ వాడకం కూడా రెండింతలు దాటింది. 2018 నుంచి 2022 వరకు వ్యవసాయానికి 1460 కోట్లు చెల్లించింది. మరమగ్గాల సబ్సిడీ 2001 నుంచి 2022 వరకు 115.50 కోట్లు చెల్లించింది. అలాగే మరమగ్గాల పరిశ్రమకు 27 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తున్నది. నేతన్న సంక్షేమం కోసం మంత్రి కేటీఆర్ మరమగ్గాలకు 50 శాతం విద్యుత్ రాయితీని అందిస్తుండగా, అందుకు గాను ప్రభుత్వం ఏటా 5.50కోట్లు చెల్లిస్తున్నది. నాయీబ్రహ్మణులకు 250 యూనిట్లు, రజకులకు 250యూనిట్ల కరెంటు సబ్సిడీపై అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు నెలకు వంద యూనిట్ల చొప్పున ఫ్రీగా ఇస్తున్నది. ఎస్సీలకు సంబంధించి 20,227 కనెక్షన్లు ఉండగా ఏడాదికి 69.74 లక్షలు, ఎస్టీలకు సంబంధించి 1634 కనెక్షన్లకు 5.63 లక్షలు చెల్లిస్తున్నది.
ఉమ్మడి పాలనలో విద్యుత్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియకపోయేది. రోజులో నాలుగు గంటలు కూడా ఉండేది కాదు. అది కూడా లోవోల్టేజీతో సరఫరా అయ్యేది. దీంతో మోటర్లు కాలిపోయేవి. మరమగ్గాలు నడిచేవి కాదు. దీంతో రైతులు, పరిశ్రమల వ్యాపారులు తీవ్రంగా నష్టాలు చూసేది. కరెంటు సమస్యతో వ్యవసాయ రంగంతోపాటు వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో కూరుకు పోయింది. చేతినిండా పనిలేక ఎన్నో కుటుంబాలు ఆగమయ్యాయి. కానీ, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. వేలాది కోట్లతో పనులు చేయించారు. రైతాంగానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ చొరవతో వందలాది కోట్లతో సెస్‌ను బలోపేతం చేశారు. కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుతోపాటు అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు వేయించారు. లూజ్ లైన్లను సరి చేయించారు. నేతన్న కోసం మరమగ్గాలకు సబ్సిడీపై నాణ్యమైన కరంట్ అందిస్తున్నారు. నాయీబ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్లు ఇస్తున్నారు. అలాగే, పరిశ్రమలకు కూడా కోతల్లేని విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఫలితంగా రైతులు, నేతన్నలతోపాటు అన్నివర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.