సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ కాసర్ల పద్మ (56) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు చేరుకొని, నివాళులర్పించి భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం నాయకులు నివాళులర్పించి, కన్నీటి వీడ్కోలు పలికారు.
సిరిసిల్ల టౌన్, మే 29: సిరిసిల్ల మున్సిపల్ 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ (బీఆర్ఎస్) హఠాన్మరణం చెందింది. మూడు రోజుల క్రితం ఛాతిలో నొప్పి రావడంతో కరీంనగర్‌లోని ప్రతిమ దవాఖానలో చేర్పించగా, అక్కడ బైపాస్ సర్జరీ జరిగింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో దవాఖానలోనే మృతిచెందింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచి ఆరు నెలలైనా కాకముందే చనిపోవడం శ్రేణులను కలిచివేసింది. ఆమె మృతి చెందిన వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హూటాహూటిన హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు చేరుకున్నారు. పద్మ భౌతిక కాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు.
పార్టీ కండువా కప్పి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, భావోద్వేగానికి గురయ్యారు. విషాద వదనంతో, చెమ్మగిల్లిన కండ్లతోనే వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పద్మ అకాల మరణం అత్యంత బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ దార్ల సందీప్, నాయకుడు బొల్లి రామ్మోహన్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, నాయకులు, కౌన్సిలర్లు నివాళులర్పించారు. అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, పద్మకు ఇద్దరు కొడుకులు శ్రీనివాస్, శేఖర్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భర్త పర్శరాములు పదేండ్ల క్రితమే మృతి చెందాడు.