సిరిసిల్ల మున్సిపల్‌పై బీఆర్ఎస్ వరుసగా మూడోసారి గులాబీ జెండా ఎగురవేసింది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో దూసుకెళ్లిన బీఆర్ఎస్, తాజాగా మున్సి‘పోల్స్’లో చర్రితలో సరికొత్త రికార్డు సృష్టించింది. 39 వార్డులకు ఏకంగా 27 వార్డులు కైవసం చేసుకొని, మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నది. సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా జిందం కళ, వైస్ చైర్మన్‌గా దార్ల సందీప్ ఎన్నిక కాగా, కార్మికక్షేత్రంలో పద్మశాలీయులకు కేటీఆర్ పెద్దపీట వేయడంపై హర్షం వ్యక్తమైంది.
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల మున్సిపాలిటీలో 2014 నుంచి మొదలైన బీఆర్ఎస్ విజయ ప్రస్థానం నేటికి కొనసాగుతూనే ఉన్నది. మొదటి సారి 2014 ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురగా, 2020లోనూ 22 స్థానాలు సాధించి, మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నది. తాజాగా, జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ అదేజోరు కొనసాగించి, 39 వార్డులకు 27 స్థానాల్లో గెలుపొందింది. సోమవారం మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా, చైర్‌పర్సన్‌గా 3వ వార్డు కౌన్సిలర్ జిందం కళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020లోనూ జిందం కళ చైర్‌పర్సన్‌గా ఎన్నికై సేవలు అందించారు.
ఆమె వరుసగా రెండోసారి చైర్‌పర్సన్‌గా ఎన్నికై సిరిసిల్ల మున్సిపల్ చరిత్రలో మరో రికార్డు సృష్టించారు. అలాగే యువతకు ప్రాధాన్యం ఇచ్చి, వైస్‌చైర్మన్ పదవిని 34వ వార్డు కౌన్సిలర్ దార్ల సందీప్‌కు అవకాశం కల్పించారు. ఆది నుంచీ నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న రామన్న ఇప్పుడు చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులను పద్మశాలీయులకే కట్టబెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. వందలాది మందితో పట్టణంలో విజయోత్సవ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ దార్ల సందీప్‌తోపాటు వార్డు కౌన్సిలర్లు అంబేద్కర్, నేతన్న, గాంధీ విగ్రహాలకు పూల మాలలు వేశారు.
బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. 2009లో టీడీపీని వీడి పార్టీలో చేరి, అప్పటి నుంచి ఆయన వెంటే నడుస్తున్నారు. విధేయుడిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్.. చక్రపాణికి పార్టీ పట్టణ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి చక్రపాణి పార్టీ బలోపేతం కృషి చేశారు. అలాగే 2014లో తన సతీమణి జిందం కళను 9వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేయించారు. అప్పుడు ఓటమి చెందగా, 2020లో మరోసారి 3 వార్డు నుంచి పోటీ చేసి ఆమె గెలిపారు. కేటీఆర్ ఇచ్చిన అవకాశంతో మొదటిసారి చైర్‌పర్సన్‌గా ఎన్నికై ఐదేళ్ల పాటు సేవలందించారు. సిరిసిల్ల అభివృద్ధికి కృషి చేశారు. తాజా ఎన్నికల్లోనూ 3వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందడంతో కేటీఆర్ మరోసారి చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. వరుసగా రెండోసారి చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడం మున్సిపల్ చరిత్రలో రికార్డుగా నిలిచింది.
సిరిసిల్ల మున్సిపల్ వైస్‌చైర్మన్ పదవి కేటాయింపులో కేటీఆర్ యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. 34వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన దార్ల సందీప్‌కు అవకాశం కల్పించారు. దార్ల సందీప్ 2014లో టీడీపీ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. తర్వాత 2016లో బీఆర్ఎస్లో చేరారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన సతీమణి కీర్తనను బరిలో నిలుపగా, ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సందీప్ బరిలో నిలిచి గెలుపొందారు. మూడు సార్లు ఎన్నికై బీఆర్ఎస్లో చురుకుగా పనిచేయడం, సీనియర్ కౌన్సిలర్‌గా, యువనేతగా పేరుండడంతో వైస్ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు.