సిరిసిల్ల టౌన్, జూలై 3 : అండగా ఉంటామని అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని ఆటో కార్మికులు ఆగ్రహించారు. హామీలు అమలు చేయడం చేతగాకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగిపోవాలని హితవుపలికారు. ఈ మేరకు గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌లో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్(బీఆర్టీయూ) ఆధ్వర్యంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చి ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని విమర్శించారు. ఏడాదికి 12వేలు ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పి మరిచిపోయిందన్నారు. ఆటో కార్మికులు కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితులలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం ఇంటి అద్దె, ఆటో ఫైనాన్స్ చెల్లించలేకపోతున్నారని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 142మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన చెందారు. అసెంబ్లీ వేదికగా ఆటో కార్మికులకు అండగా నిలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 25లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఆటో కార్మికుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని, ప్రతి కార్మికుడికి 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, ఏడాదికి 15 వేల ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కనకం శ్రీనివాస్, సలీం, పులి నాగరాజు, గాండ్ల శ్రీనివాస్, చింత విక్కీ, మల్యాల దేవరాజ్, రేగుల రవి, పాల్గొన్నారు.