Singareni School | గోదావరిఖని : ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుపోకుండా సింగరేణి పాఠశాలల్లో ఈ విద్య సంవత్సరం పదో తరగతిలో నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎడ్యుకేషనల్ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ )వెంకటాచారి కోరారు. ఇటీవలనే పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన గోదావరిఖని పట్టణంలోని సింగరేణి పాఠశాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అడ్మిషన్లు ఉపాధ్యాయుల రికార్డులను పరిశీలించి అనంతరం వారితో సమావేశమై మాట్లాడారు.
పదో తరగతిలో నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సింగరేణి సంస్థ విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సూచనల మేరకు సింగరేణి పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఆయన కోరారు. మొదటిసారిగా పాఠశాలను సందర్శించిన జీఎంను పాఠశాల కరస్పాండెంట్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి పాఠశాల హెడ్మాస్టర్ సంతోష్ కుమార్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.