పెద్దపల్లి, జూన్ 1( నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణలో స్థానిక కళాకారులకు సింగరేణి యాజమాన్యం మొండి చెయ్యి చూపించింది. పెద్దపల్లి జిల్లా సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ వేడుకలకు సిద్ధం కావాలని 15 రోజుల క్రితమే స్థానిక కళాకారులకు సింగరేణి అధికారులు తెలిపారు. ఎప్పటి మాదిరిగానే స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గత 15 రోజులుగా వేడుకల్లో కార్యక్రమాల నిర్వహణ, సాంస్కృతిక ప్రదర్శనల కోసం దాదాపుగా 200ల మంది కళాకారులు 15 మంది మాస్టర్ల సారథ్యంలో తర్ఫీదు పొందారు. సాంస్కృతిక ప్రదర్శనలన్నీ హైదరాబాద్ నుంచి వచ్చే కళాకారులే చేస్తారని “మీకు కార్యక్రమాలు ప్రదర్శించే అవకాశం లేదు” అని చెప్పడంతో స్థానిక మాస్టర్లు, కళాకారులు అవాకయ్యారు.
ప్రోగ్రామ్స్‌కు సిద్ధం కావాలని చెప్పి, సమయానికి నిరాకరించడంతో వారు ఆందోళనకు గురయ్యారు. ప్రతీ సంవత్సరం గోదావరిఖనిలో నిర్వహించే దసరా, సింగరేణి ఉత్సవాలు, తెలంగాణ అవతరణ వేడుకలతో ఉపాధి పొందే తమకు సింగరేణి అధికారులు అన్యాయం చేశారని వాపోతున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు 15 రోజులుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల శిక్షణతోపాటు కాస్ట్యూమ్స్‌కు సైతం పెద్ద ఎత్తున ఖర్చు చేశామని, తీరా సమయానికి సింగరేణి అధికారులు తమకు కార్యక్రమం ఇవ్వకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. ఆర్జీ-1 నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో కలిసినా ఎలాంటి ఫలితం లేక పోవడంతో మీడియాతో గోడు వెల్లబోసుకున్నారు. సింగరేణి కార్మికుల పిల్లలను కాదని వేరే వారికి అవకాశం ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని వారం రోజుల కిందట మాకు చెప్పారు. దీని కోసం మేం పిల్లలను అన్ని విధాలుగా తయారు చేశాం. ఈ క్రమంలో సింగరేణి అధికారులు మాకు ఫోన్ చేసి ప్రోగ్రాం ఇవ్వడం లేదు, హైదరాబాద్ జబర్దస్త్ టీంకు అప్పగిస్తున్నామని చెప్పారు. ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తిరుపతి మాకు ప్రోగ్రాం ఉందని చెప్పి మళ్లీ ఇలా చేశారు. ఇదే విషయమై జీఎం కార్యాలయానికి వెళ్లి హనుమంతురావు సార్‌ను అడిగితే మాతో చాలా దురుసుగా మాట్లాడారు. మీకు ఎవరు చెప్పారో వాళ్లనే అడగండని, ప్రోగ్రాం మాకు ఇవ్వడం లేదని చెప్పారు. మేం జీఎంను కలుస్తామన్నా సార్ లేరు వెళ్లిపోండి అంటూ బయటికి పంపించారు.
-విజయ్, డ్యాన్స్‌మాస్టర్
సింగరేణి సాంస్కృతిక కార్యక్రమాలను మేం 18 ఏళ్లుగా స్థానిక కళాకారులతో కలిసి నిర్వహిస్తున్నాం. ఈసారి మాత్రం హైదరాబాద్‌లోని జబర్దస్త్ టీంకు అప్పగించినట్లు చెప్తున్నారు. మొదట మమ్మల్ని సిద్ధం కావాలని చెప్పి చివరికి మొండిచెయ్యి చూపడం సరికాదు. ఇప్పటికే పిల్లలంతా వారు చేసే ప్రోగ్రామ్స్ సంబంధించిన డ్రెస్, కాస్ట్యూమ్స్ సిద్ధం చేసుకున్నారు. సింగరేణి సంస్థ 200 మంది పిల్లలు, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు కళాకారులను అవమాన పరిచింది.
-పులిపాక దేవేందర్, కళాకారుడు