గంగాధర, జనవరి 12 : సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగురవేసే గాలిపటాలకు దుకాణదారులు నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వంశీకృష్ణ హెచ్చరించారు. చైనా మాంజా ప్రమాదకరమని, దానిని విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పన్నారు. చైనా మాంజా విక్రయాలు, నిల్వ, వినియోగంపై కఠిన ఆంక్షలు విధించినట్లు తెలిపారు. పర్యావరణానికి, ప్రాణాలకు ముప్పుగా మారిన చైనా మాంజాపై పూర్తిస్థాయిలో నిషేధం అమలులో ఉందని, మనుషులు, జంతువులు, పక్షులకు నైలాన్ దారం వల్ల తీవ్రంగా గాయపడుతున్నట్లు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు.
చైనా మాంజా పక్షులు, మానవజీవాల ప్రాణాలకు పెను ముప్పుగా మారిందన్నారు. మండల వ్యాప్తంగా చైనా మాంజా అమ్మకాలను అరికట్టడానికి ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. షాపులు, గోదాములు నిరంతరం తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి చైనా మాంజాను తయారు చేసినా, విక్రయించినా లేదా నిల్వ ఉంచినవారిపై చట్టపరంగా కఠినమైన, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
పతంగి ఎగరేసేందుకు సాధారణ కాటన్ దారాలను మాత్రమే వాడాలని, విద్యుత్ లైన్ల దగ్గర, రద్దీగా ఉండే రోడ్లు, జనసమూహం ఉన్న ప్రాంతాల్లో పతంగులు ఎగరవేయవద్దని సూచించారు. పరిసరాల్లో ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు, డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. సంక్రాంతి పండుగను ప్రమాదాలు లేకుండా, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్ఐ వంశీకృష్ణ ప్రజలకు సూచించారు.