చిగురుమామిడి, జూన్ 6: ‘పథకాలకు లంచాలు అడుగుతారా..? ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువవికాసం పథకాల కోసం కాంగ్రెస్ నాయకులు అనర్హులను ఎంపిక చేస్తారా?’ అని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు సైతం విఫలమయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్ చిగురుమామిడి మండలశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరాగా, అధికారులను లోనికి వెళ్లకుండా కార్యాలయం ఎదుట బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ, రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల ఎంపికలో భాగంగా పలువురు కాంగ్రెస్ నాయకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. బొమ్మనపల్లి గ్రామంలో కొమిరె లక్ష్మణ్‌గౌడ్‌కు గుంట భూమి కూడా లేదని.. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు కోసం 50వేలు ఖర్చు అవుతుందని ఓ నాయకుడు తెలిపారన్నారు. అర్హులైన బాధితుడికి ఇల్లు మంజూరుకాలేదన్నారు. ఓ మేజర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సైతం డబ్బుల కోసం డిమాండ్ చేశారని మండిపడ్డారు.
ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అనర్హులను ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువవికాసం పథకాలకు ఎంపిక చేశారన్నారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాల్సి ఉండగా, అధికారులు సైతం కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలికారని మండిపడ్డారు. ఇప్పటికైనా అర్హులను ఎంపిక చేయకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో జిల్లా నాయకుడు సాంబారి కొమురయ్య, మండ ల నాయకులు పెసరి రాజేశం, బేతి రాజిరెడ్డి, రామోజు కృష్ణమాచారి, ఎండీ సర్వర్‌పాషా, సందీప్‌రెడ్డి, జకుల రవీందర్, సన్నీల వెంకటేశం, బెజ్జంకి లక్ష్మణ్, బోయిని శ్రీనివాస్, మిట్టపల్లి మల్లేశం, కరివేద మహేందర్‌రెడ్డి, శ్యామకూర సంపత్‌రెడ్డి, గీట్ల తిరుపతిరెడ్డి, బుర్ర తిరుపతి, బోయిని శ్రీనివాస్, కత్తుల రమేశ్, నాగేలి రాజిరెడ్డి, రావుల వెంకన్న, పిల్లి వేణు, నారాయణ, బిల్లా వెంకటరెడ్డి, సన్నీల మల్లేశం, బోయిని రమేశ్, మక్బుల్పాషా, శరబందరెడ్డి, కొమురయ్య, మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల కోసం సాధ్యమైనంత వరకు అర్హులను ఎంపిక చేశాం. ఒకవేళ కొన్ని గ్రామాలలో ఎకడైనా అనర్హులకు మంజూరైతే ఎరువేతను తొలగించేందుకు అవకాశం ఉన్నది. అనర్హుల ఏరువేత నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నది. మరోసారి గ్రామాల వారీగా అర్హులను పరిశీలిస్తాం.
– బాషం మధుసూదన్, ఎంపీడీవో (చిగురుమామిడి)